Tirupati: స్పెషల్ కోర్టు ద్వారా 3 నెలల్లో నిందితుడికి కఠిన శిక్ష: హోంమంత్రి అనిత
AP Home Minister Vangalapudi Anitha: తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన మూడేళ్ల చిన్నారి కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి అనిత పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించారు.
చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ప్రత్యేక కోర్టు ద్వారా 3 నెలల వ్యవధిలోనే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. అలానే బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరికాదని మంత్రి అనిత ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.