AP Volunteers: దిక్కుతోచని స్థితిలో రాజీనామా చేసిన వాలంటీర్లు

AP Volunteers: వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరించిన వలంటీర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.

Update: 2024-06-28 06:21 GMT

AP Volunteers: దిక్కుతోచని స్థితిలో రాజీనామా చేసిన వాలంటీర్లు

AP Volunteers: వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరించిన వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు, నాయకులు చాలామంది బలవంతంగా వాలంటీర్లతో రాజీనామా చేయించారు. వారినే ఎన్నికల ప్రచారంలో కూడా ఉపయోగించుకున్నారు. ఎన్నికల అనంతరం ఫలితాలు తారుమారు కావడంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారింది.

తమతో బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రస్తుత టీడీపీ నాయకుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు వాలంటీర్లు దీంతో రాజీనామా చేయించి జీవనభృతి పోగొట్టిన వైసీపీ నేతలపై కేసులు పెట్టాలంటూ టీడీపీ నేతలు సలహా ఇస్తున్నారు. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు. కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

వ్యవస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనల మేరకు పనిచేయాలి కానీ అధికార పార్టీకి అనుచరులుగా పనులు చేయకూడదు. ఈ వాస్తవాన్ని మరిచారు కొంతమంది కడప జిల్లాలోని చాలామంది వాలంటీర్లు అయితే ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ సీపీకి వలంటీర్ల వ్యవస్థ సైన్యంలా పనిచేసిందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించి తామంతట తామే రాజీనామా చేసి వైఎస్‌ఆర్ సీపీ ప్రచారంలో పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు, నాయకుల ఒత్తిడితో రాజీనామా చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇదివరకు తమ వార్డుల్లో ప్రజలకు పింఛన్ల పంపిణీ, అమ్మఒడి, రైతు భరోసా, నవరత్నాల పథకాలను చేరవేస్తూ వచ్చారు వాలంటీర్లు.

దీంతో వలంటీర్లకు ప్రజలకు మధ్య ఏర్పడిన సంబంధాలను పార్టీకి వినియోగించుకోవాలనుకున్నారు వైసీపీ నాయకులు. ఈ క్రమంలోనే ప్రచారాల్లో నాయకులు పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వినియోగించుకున్నారని ఆరోపణలున్నాయి. రాజీనామా చేయకుండా వైఎస్‌ఆర్ సీపీకి ప్రచారం చేస్తున్న వాలంటీర్లపై ప్రత్యర్థి పార్టీలు చేసిన ఫిర్యాదులతో కొంతమందిని ఎన్నికల అధికారులు తొలగించారు. కాగా కొంతమంది తాము రాజీనామా చేసేది లేదంటూ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వలంటీర్లుగా కొనసాగుతున్న వారు గత నెల వేతనం కూడా తీసుకున్నారు.

కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వలంటీర్లు చాలామంది రాజీనామా చేసి వైఎస్‌ఆర్ సీపీ తరఫున ప్రచారం చేశారు. ప్రస్తుతం వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, గెలిచిన నాయకుల వద్దకు వెళ్లి తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామా చేయించారని, విధి లేని పరిస్థితిలో తాము వైసీపీకి ప్రచారం చేశామని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. నాయకులు ఏమీ చెప్పలేక ఎవరైతే మీ ఉద్యోగాలు తీయించారో వారిపై కేసులు పెట్టండంటూ సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చివరికి పులివెందులలో కూడా కొంతమంది వలంటీర్లు తమకు వైసీపీ నాయకులు అన్యాయం చేశారని తమతో ఎన్నికల ప్రచారం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా జరుగుతున్నాయి.

గతంలో వైసీపీ నేతల అండతో అతిగా ప్రవర్తించిన వలంటీర్ల జాబితా సేకరించి వారిపై కేసు నమోదు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇకమీదట పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను నేరుగా సచివాలయ సిబ్బంది ద్వారానే ప్రజలకు అందజేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో భవిష్యత్తు లేదని కొందరు వలంటీర్లు వైసీపీ నాయకుల వద్దకు రాగా మరికొందరు టీడీపీ కూటమి నాయకులను ఆశ్రయిస్తూ తమకు జీవనోపాధి కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే అభద్రతాభావంతో బతకాల్సి వస్తోంది. ఏదేమైనా ఎన్నికల రాజకీయాలు వలంటీర్ల జీవితాలతో చెలగాటమాడాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News