నేడు విశాఖకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి
* విశాఖలో పర్యటించనున్న కేంద్రమంత్రి ఫగన్ సింగ్ పర్యటన
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం కొంతకాలంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై ప్రతిపక్ష, వివక్ష పార్టీలు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ప్రైవేటీకరణ వ్యవహారంపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఇక స్టీల్ ప్లాంట్‌ను టేకోవర్ చేసుకునేందుకు కూడా రెడీ అయ్యారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. సింగరేణి సీఎండీతో సమావేశమయ్యారు. ఈ సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్... స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశం కానున్నారు.
ఇవాళ ఫగన్ సింగ్ కులస్తీ విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమై.. తాజా పరిస్టితులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా ఫగన్ సింగ్ ఆహ్వానించారు. ఈ మేరకు కులస్తీ రాక, సమావేశం కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే తెలంగాణ సింగరేణి నుంచి ముగ్గురు డైరెక్టర్లు వెళ్లిన సమయంలోనే ఫగన్ సింగ్ కులస్తీ విశాఖ పర్యటనకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.