Tirumala: తిరుమల కొండలను కప్పేస్తున్న దట్టమైన మంచు
Tirumala: ఓవైపు ఆధ్యాత్మికం.. మరోవైపు ప్రకృతి రమణీయత
Tirumala: ఎత్తైన కొండలను మంచుతో కప్పేస్తూ హిమాలయ పర్వతాలను తలపించేలా వెండి కొండలుగా మారింది శేషాద్రి నిలయం. మెల్లగా వీస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచె చల్లని గాలులు. ఓ వైపు ఆధ్యాత్మికం.. మరో వైపు ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు తిరుమల పుణ్యక్షేత్రం. వేసవిలో తిరుమలకు వచ్చే యాత్రికులు స్వామి వారి ఆశీస్సులతో పాటు మరచిపోలేని మధురానుభూతులను తీసుకెళ్తున్నారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తిరుమలలో పొగమంచు కమ్మేయడంతో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భక్తులు సేద తీరుతున్నారు.
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల ఎన్నో మహిమలకే కాదు... ప్రకృతి అందాలకూ నెలవు. సూర్యోదయ... సూర్యాస్తమయం సమయాలలో ఏడుకొండలపై మంచు దుప్పటి కమ్మేయడంతో అద్భుతమైన వాతావరణం కనిపిస్తుంటుంది. వేసవిలోనూ ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతో ఏడు కొండలను పొగమంచు కప్పేస్తుంది. స్వామి వారిని.. సప్తగిరులనూ మంచు ముద్దాడుతున్నట్లుగా మేఘాలు ఆవహించాయి. మంచుతో కూడిన సరికొత్త వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధానంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో భక్తులకు నూతన అనుభూతులు కలిగిస్తోంది. అలిపిరి మార్గం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ ప్రకృతి అందాలను తిరుమలకు వచ్చే భక్తులు ఆస్వాదిస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వస్తే.... బోనస్‌గా ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తున్నాయి.
తిరుమలలో భారీగా మంచు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు కనపడని పరిస్థితి ఏర్పడింది. వాహనాలలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహన దారులు మంచుతో ఇబ్బంది పడుతున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకుంటున్న భక్తులు.. దారి పొడవునా కమ్మేసిన మంచును ఆస్వాదిస్తూ ఆ చిత్రాలను తమ మొభైల్స్‌లో బంధిస్తున్నారు. మంచు తెరల మధ్య శ్రీవారి ఆలయాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో గదులు దొరకని భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్దులు చలిని తట్టులేకపోతున్నారు. తిరుమల సముద్ర మట్టనికి 5 వేల మీటర్ల ఎత్తుల్లో ఉండటంతో సాధారణంగానే చల్లని వాతావరణం ఉంటుంది. తాజాగా దట్టంగా కురుస్తున్న మంచు భక్తులను మరింత ఆకట్టుకుంటోంది.