Varahi Yatra: ఈనెల మూడో వారంలో నాలుగో దశ వారాహి యాత్ర
Varahi Yatra: రాష్ట్ర వ్యాప్తంగా వారాహియాత్రతో బహిరంగ సభలు
Varahi Yatra: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనపై తనదైన శైలిలో ఎండగట్టే పవన్ కళ్యాణ్ వారాహియాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మూడు దశల్లో చేపట్టిన వారాహి యాత్రతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంపొందించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతానికి వారాహియాత్ర వెన్నుదన్నుగా నిలిచింది. ఉబయ గోదావరిజిల్లాలు, విశాఖ జిల్లాలో యాత్ర స్ఫూర్తితో నాలుగో విడత వారాహియాత్రకు సమాయాత్తమవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకాన్ని జాగృతం చేయాలని సంకల్పించిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. రాజకీయ విమర్శలకు దిగినోళ్లకు తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ సమాధానాలివ్వడంతోపాటు... ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై విరుచుకుపడ్డారు. వారాహి విజయయాత్ర ద్వారా మూడు విడతల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. మొదటి విడతలో ఉమ్మడి గోదావరి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో విడతలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి జైత్రయాత్ర కొనసాగింది. ఇక మూడో విడత వారాహి యాత్రను ఆగస్ట్ 10 నుంచి 19వ తేదీ వరకూ ఉమ్మడి విశాఖపట్నంలో కొనసాగించారు. విశాఖపట్నం పర్యటనలో రెండు బహిరంగ సభలు నిర్వహించారు.
వారాహి యాత్రలతో జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టి, వచ్చే ఎన్నికల్లో జనసేనకు పట్టంగట్టాలని ఎన్నికల ప్రచారానికి వారాహియాత్ర దోహదమైంది. వారాహి యాత్రల్లో ఎక్కడికక్కడ నాయకుల పనితీరును ఉతికి ఆరేసి... ప్రజలను ఆలోచింపజేశారు. వారాహి సభల్లో పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగా ఆలోచించపచేసే విధంగా సాగాయి. మూడు దశల యాత్రలో... విశాఖపట్నంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ఎక్కువ సమయం కేటాయించారు. రుషికొండతో, ఎర్రమట్టి దిబ్బల పరిశీలన ద్వారా ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనను అంతంమొందించడమే లక్ష్యంగా వారాహి యాత్ర అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయా ముసుగులో ప్రకృతిని ధ్వంసం చేస్తూ... ప్రజాధనాన్ని దోచకుకుంటే సహించేది లేదని అధికార పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.
తొలి, మలి దశ యాత్రలను త్వరితగతిన పూర్తిచేసిన పవన్ కళ్యాణ్, మూడో విడత యాత్రకు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఇపుడు సినిమా షూటింగ్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్...నాలుగోవిడత వారాహి యాత్రను ఆలస్యంగా చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజకీయ విమర్శలకు వేదికగా నిలిచిన కృష్ణాజిల్లాలో నాలుగో విడత వారాహియాత్ర చేపట్టేందుకు పార్టీ శ్రేణులులు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర ద్వారా పార్టీ నేతలు, కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అయితే వారాహి యాత్ర ప్రారంభం అయిన తర్వాత మొదటి మూడు విడతల యాత్రలకు మధ్యలో పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. కేవలం బ్రో సినిమా రిలీజ్ సమయంలో మాత్రం కాస్త విరామం తీసుకున్నారు.
కానీ ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమా ప్రాజెక్టులతో అటు యాత్రకు ఇటు సినిమాలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఉంది. అప్పటినుంచి పన్నెండో తేదీ వరకూ షూటింగ్‌లోనే ఉంటారని తెలిసింది. ఇక సెప్టెంబర్ మూడో వారం నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు జనసేన నేతలు. దానికి తగ్గట్లుగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
వచ్చే నాలుగు నెలలు ప్రతి నెలా సగం రోజులు సినిమా షూటింగ్‌కు, మరో సగం రోజులు పార్టీకి కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. నెలలో సగం రోజులు పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి సారించేవిధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. పార్టీ నేతలు.. ఇదే సమయంలో వారాహి యాత్రతో పాటు పార్టీ జాయినింగ్స్, నియోజకవర్గాల వారీగా సమీక్షలపైనా దృష్టి పెట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇక జనవరి నుంచి సినిమాలకు పూర్తి దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు. ఎన్నికల వరకూ మొత్తం 100 రోజుల పాటు 100 సభలు నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధంచేస్తున్నారు. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా వారాహి యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని, ప్రజలతో మమేకం కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు.