TTD: తిరుమలలో ప్రణయ కలహోత్సవం
TTD: తిరుమలలో ప్రణయ కలహోత్సవం...నేత్రపర్వంగా సాగిన కార్యక్రమం.
TTD: నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా విరాజిల్లుతున్న శ్రీవారి ఆలయంలో జరిగే ప్రణయ కలహోత్సవానికి చాలా విశిష్టత ఉంటుంది. రుక్మిణి, సత్యభామల మధ్య జరిగిన కలహా ఘట్టానికి ఆధారంగా, ప్రతి యేడాది ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నుండి 6రోజు శ్రీవారికి ఆగమానుసారం ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో స్వామివారికి నిర్వహించిన కలహోత్సవం నేత్రపర్వంగా సాగింది.
ప్రతిరోజు మాడవీధుల్లో విహారించే స్వామివారు, ఒంటరిగా బంగారు తిరుచ్చిని అదిరోహించి ఊరేగింపుకు వెళుతారు. దీంతో మొదట ఆగ్రహించిన అమ్మవార్లు ఇరువురు స్వామి ఒంటిరిగా విహరించడంపై అనుమానంతో వేరొక్క బంగారు తిరుచ్చిపై ఆలయం నుండి అప్రదక్షణ బయల్దేరుతారు. స్వామివారు తూర్పుమాడవీధిలోని వరాహాస్వామి ఆలయం వద్దకు రాగానే అమ్మవార్లు ఎదురుపడి స్వామి వారిని అడ్డుకుంటారు.
ఇక అప్పటికే ఆగ్రహంతో అలకపాన్పు ఎక్కిన అమ్మవార్లకు తాను ఎలాంటి తప్పిదం చేయలేదని శ్రీవారు ఎన్ని చెప్పినా అమ్మవార్లు పట్టించుకోకుండా కోపంతో స్వామివారిపై మూడు పర్యాయాలు పూలబంతులను విసురుతారు. స్వామి అమ్మవార్లకు ప్రతినిధులుగా అర్చకులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మొత్తానికి స్వామివార్ల మధ్య ఏర్పడ్డ ఈ కలహాన్ని రామానుజాచార్యుల వారసులైన జీయంగార్లు సర్ధిచెప్పడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది.