పోయిన చోటే వెతుక్కోవాలి. ఓడిన చోటే గెలవాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే సూత్రం ఔపోసన పట్టినట్టున్నారు. తనను ఓడించిన భీమవరంలో అడుగుపెట్టి, ఓడినా, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ఓకే, ఇదే భీమవరం సభలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు, ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేతల్లో హాట్‌హాట్ డిస్కషన్‌కు దారి తీస్తున్నాయి. ఇంతకీ భీమవరంలో పవన్ వ్యాఖ్యలేంటి ఆ మాటల వెనక మర్మమేంటి?
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినత పవన్ కల్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం. అనూహ్యంగా, అంచనాలను తలకిందులు చేస్తూ, పవన్ కల్యాణ్‌కు ఓటమి కట్టబెట్టారు భీమవరం జనం. ఇప్పుడు తాజాగా ఈ సభ జరిగింది కూడా భీమవరంలోనే. తనను గెలిపించని భీమవరంలో, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి అడుగుపెట్టారు పవన్ కల్యాణ్. అప్పటిలాగే జనం కూడా విపరీతంగా పవన్ సభకు వచ్చారు. యువకులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. ఓడినందుకు ఏమాత్రం బాధలేదని, తన రాజకీయానికి సుదీర్ఘ ప్రణాళిక ఉందని బహిరంగ సభలో చెప్పారు పవన్.
అయితే ఇదే భీమవరం సభలో పవన్ కల్యాణ్ చేసిన కొన్ని కామెంట్లు, రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎన్నికల్లో అధికారం సాధించలేకపోయిన తరువాత ప్రజారాజ్యంలో ఏ విధంగా అయితే చిరంజీవి మీద వత్తిడి తెచ్చి, కాంగ్రెస్‌లో కలిపేసారో? ఇప్పుడు తనమీద కూడా అలాంటి వత్తిడి తెస్తున్నారని అన్నారు పవన్ కల్యాణ్. ప్రాణంపోయినా జనసేనను విలీనం చేయనని చెప్పారాయన. ఈ కామెంట్స్‌పైనే పొలిటికల్ వర్గాల్లో హాట్‌హాట్ డిస్కషన్ అవుతోంది.
పార్టీ విలీనం కోసం ఒత్తిడి తెస్తున్నది ఎవరు?
ఏ పార్టీలో కలవాలని తొందరపెడుతున్నారు?
ఇప్పుడు ఇవే ప్రశ్నలు వివిధ రాజకీయ పార్టీల్లోనే కాదు, సొంత జనసేనలోనూ వినిపిస్తున్నాయి. పవన్ ఇలాంటి కామెంట్లు చేయడం ఆశ్చర్యంగా ఉందని కొందరు నేతలు అంటుంటే, మరికొందరు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకసారేమో ఆఖరి కార్యకర్త వున్నంత వరకు జనసేన ఇలాగే వుంటుందని ఒకసారి, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు అన్నీ మనవే అని మరోసారి పవన్ అన్నారు. మరి విలీనం కామెంటు కూడా చేయడంతో, పవన్ వైఖరి అర్థంకాక తికమక పడిపోతున్నారు జనసైనికులు.
ప్రజారాజ్యం విలీన సమయంలో జరిగింది వేరు. నాటి పరిస్థితులు వేరు. చిరంజీవి ఆలోచనలు వేరు. ఇప్పుడు జనసేన సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్. పీఆర్పీ టైంలో చాలామంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరపున గెలిచారు. కొందరు పీఆర్పీ నేతలే కాదు, చిరంజీవి కూడా ఇక కాడి మోయడం కష్టమని దించాలని అనుకున్నారన్న చర్చ జరిగింది. జెండా పీకేద్దామన్న వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. వాటిని చిరంజీవి సైతం ఖండించారు. కానీ చివరికి అదే జరిగింది. కాంగ్రెస్‌లో విలీనం జరిగిపోయింది. పీఆర్పీ ఎమ్మెల్యేల్లో కొందరికి మంత్రి పదవులు వచ్చాయి. చిరంజీవికి రాజ్యసభ దక్కింది. కేంద్రమంత్రి అయ్యారు. యూపీఏ ఓడిపోయినా, తన రాజ్యసభ పదవీకాలం ఉన్నంత వరకూ, అలాగే ఎంపీగా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగి, సినిమాలపై ఫోకస్ పెట్టారు. అప్పుడు కానీ, ఎప్పుడు కానీ తాను ఎవరివల్లనో పార్టీ కలిపేసానని అనలేదు చిరంజీవి.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పెట్టిన దగ్గర నుంచీ ప్రజారాజ్యం ఫెయిల్యూర్‌కు అందులో వున్న నాయకులే తప్ప, చిరంజీవి కారణం కాదని అన్నను వెనకేసుకొస్తున్నారు. ఆది నుంచీ కన్నబాబు, గంటా శ్రీనివాసరావు లాంటి మాజీ ప్రజారాజ్యం నేతల మీద పవన్ కోపానికి ఇదేకారణం కూడా. వారంతా కలిసి పార్టీని కలిపేయించారు అన్నది ఆయన ప్రధాన అనుమానం. అయితే నాటి ప్రజారాజ్యం పరిస్థితి వేరు, నేటి జనసేన స్థితి వేరు. మరి ఎందుకు పవన్ కల్యాణ్ విలీనం కామెంట్లు చేశారన్నదే ఎవరికీ బోధపడ్డం లేదు.
అప్పుడంటే ప్రజారాజ్యంలో ఎందరో కొందరు ఎమ్మెల్యేలున్నారు, చిరంజీవిపై ఒత్తిడి తెచ్చారు. మరి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనలో ఎవరు విలీన ప్రతిపాదన చేశారన్నది అర్థంకావడం లేదని రాజకీయ పరిశీలకులంటున్నారు. మొత్తానికి ఘోర పరాజయం తర్వాత పార్టీని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నానన్న అర్థంలో పవన్ ఇలాంటి కామెంట్లు చేసి వుంటారన్న చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు తన పార్టీని ఆదరించకపోవడానికి గతంలో ప్రజారాజ్యం భయమే కారణమన్న విశ్లేషణ ఉంది. చిరంజీవిలాగే పవన్ కూడా గెలిపించిన తర్వాత ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తారన్న అనుమానం కూడా జనంలో వుండేది. దీంతో అలాంటి అనుమానాలను పటాపంచలు చేయడానికే, ప్రాణంపోయినా జనసేనను విలీనం చేయనని పవన్ అన్నారని అర్థం చేసుకోవాల్సి వుంది. మొత్తానికి ప్రజారాజ్యం విలీనంతో చిరంజీవి షాకిస్తే, జనసేన మీద కూడా విలీన ఒత్తిడి ఉందని పవన్ కామెంట్లు చేయడం సొంత పార్టీ నేతలనే కలవరపెడుతోంది.