ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనేది రాజకీయాల్లో అనాదిగా వస్తున్న నానుడి. గతమేమోగాని ఇప్పుడా మాట, సింహపురి రాజకీయాలకు అతికనట్టు సరిపోతుంది. ఇంతకి జిల్లాలో బండ్లు అవుతున్న పార్టీ ఏది? ఓడగా బలపడుతున్న మరో పార్టీ ఏది? వలసకట్టే నాయకుల అసలు వ్యూహం ఏమిటి? అధికారం కోసం పరుగులు తీసే నాయకుల ఆంతర్యం ఏమిటి? అనుకూలంగా మలుచుకోవడంలో చక్రం తిప్పుతున్నదెవరు?
రాజకీయాలకు రాజధాని సింహపురి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు కనుమరుగవుతున్నారు. కొత్త నేతలు తెరపైకొస్తున్నారు. ఊహించని పరిణామాలు రోజుకొక్కటిగాపుట్టుకొస్తున్నాయి. మొన్నటి వరకు రాజకీయ తెర పై కనిపించని వారు సైతం ఇప్పుడు ఏకంగా చక్రంతిప్పుతున్నారు. ప్రత్యేకించి నెల్లూరు రూరల్‌లో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠగా మారుతున్నాయి. నెల రోజులుగా నెల్లూరు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
జిల్లా కేంద్రంలో మొన్నటి ఎన్నికల వరకు నగరపాలక సంస్థ, పాలక వర్గంతో పాటు భారీగా బలమున్న టీడీపీ, ఇప్పుడు వైసీపీ నేతల వ్యూహాలకు విలవిల్లాడుతోంది. రోజుకొక్కరుగా ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీలోకి వలసబాట పడుతున్నారు. కరుడుగట్టిన టీడీపీ నేతలుగా ఆ పార్టీ ప్రధాన నాయకులకు అనుచరులుగా ఉన్నవారు సైతం, గుడ్‌బై చెప్పేస్తున్నారు. రూరల్‌లో మాజీ మంత్రి సోమిరెడ్డి అనుచురులు చాలా మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్యేకించి రూరల్‌లో ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం టీడీపీ పై ప్రత్యేక గురిపెట్టారు. టీడీపీ అసంతృప్తులను బుజ్జగిస్తూ అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో డజను మందికి పైగా కార్పొరేటర్లు మొన్నటి వరకు మేయర్‌కు ఆంతరంగికులుగా,ఆత్మీయులుగా అనుచరులుగా ఉన్నవారు సైతం, గిరిధర్ రెడ్డి వ్యూహంతో వైసీపీ పంచన చేరారు. తాజాగా ఒకప్పటి ఆనం అనుచరుడు, ఆపై తాజా మాజీ మంత్రి నారాయణ ఆంతరంగికుడిగా పేరున్న లిటిల్ ఏంజల్స్ అధినేత, సీనియర్ పొలిటిషియన్ చాట్ల నరసింహారావు టీడీపీకి హ్యాండిచ్చేశారు. రేపోమాపో ఆయన వైసీపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు.
మొన్నటి వరకు టీడీపీలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులుగా పేరున్న తురకా సూరి, సంషుద్దిన్, దాసరి రాజేష్, కోడూరు కమలాకర్ రెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరారు. రేపోమాపో సీనియర్ కార్పొరేటర్ చాట్ల నరసింహారావు చేరికకు సిద్ధమవుతున్నారు. రూరల్‌లో తమదే బలమని చెప్పే టీడీపీ, ఇప్పుడు ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్ వ్యూహంతో ఆ పార్టీ విలవిల్లాడే పరిస్థితికి వచ్చింది. ఆరంభంలోనే దూకుడుగా అనుచర వర్గాన్ని పెంచుకుంటున్న కోటంరెడ్డి గిరిధర్, రోజుకో వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. దీంతో నగరంతో పాటు రూరల్‌లో టీడీపీకి ద్వితీయశ్రేణి క్రమేపి దూరమవుతోంది.
అధికారం చేజారి వంద రోజులు కాకముందే టీడీపీ ప్రధాన, ద్వితీయ శ్రేణి వర్గం వైసీపీ వైపు క్యూ కట్టడం ఇప్పుడు ప్రతిపక్షపార్టీ నేతలను కలవరపెడుతోంది. ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు వైసీపీలోకి క్యూ కట్టడం వెనుక విపరీతమైన చర్చలు సాగుతున్నాయి. మొన్నటి వరకు అధికార పార్టీలో కాంట్రాక్టులు, కొన్ని కాసుల వ్యవహారాలతో ముడిపడ్డ నాయకులకు, ఇప్పుడు వైసీపీ రాక ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేకించి నగరం, రూరల్‌లో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, పారిశుద్య పనులు, డివిజన్ అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాల్లో పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బిల్లుల చెల్లింపులు గగనమైంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ పంచన లేకుంటే కార్యాలు, కార్యక్రమాలు సాగవన్న ధోరణితోనే టీడీపీ చోటాలు వైసీపీలోకి వెళుతున్నారన్న వాదనలున్నాయి. నేతల మాటలు ఎలా వున్నా, డివిజన్ స్థాయి నాయకులు పార్టీని వీడుతుండటం, మరికొద్ది రోజుల్లోనే స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో టీడీపీ నాయకుల పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది.
మొన్నటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి గిరిధర్ రెడ్డి, ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షంపై గురిపెట్టడం ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా నగరంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. ఇంకోవైపు సిటీ నియోజకవర్గంలోను వైసీపీ నేత రూప్‌కుమార్, అందిన మేరకు టిడిపి సహా, వామపక్ష నాయకులను సైతం అధికార పక్షంలో చేర్చుకోవడంతో సింహపురి రాజకీయాలు రసకందాయంగా మారాయి.