సైరా కోసం కన్నబాబు చిరు సాయమేంటి?

Update: 2019-10-04 08:22 GMT

సైరా సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిర్మాతల గల్లా పెట్టే కళకళలాడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సైరా క్రేజ్‌ మామూలుగా లేదట. అయితే, ఇందుకోసం, జగన్‌ కేబినెట్‌లో ఓ మంత్రి, మెగాస్టార్‌కు చిరు సాయం చేశారట. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించిన చిరుకు, కృతజ్తతతో చిన్న హెల్ప్ చేశారట. ఇంతకీ ఏ మంత్రివర్యుడు చిరుకు సాయం చేశారు ఏ విషయంలో హెల్ప్ అది?

తెల్లదొరలపై మొట్టమొదటి స్వరాజ్య భేరి మోగించిన, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం, సైరా. మెగాస్టార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్. తండ్రికి తనయుడు రామ్‌ చరణ్‌ మెగా గిఫ్ట్. అతిరథ మహారథ తారాగణం. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా. బాహుబలి తర్వాత మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేలా రూపొందిన సైరా, అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందడం, తొలి రోజుల్లోనే ఎక్కువ వసూళ్లు సాధించాలని భావించింది సైరా నిర్మాతలు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో అదనపు షోలు వేసేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇందుకోసం కొన్ని రోజుల నుంచి, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సైరా నిర్మాతలు మంతనాలు జరిపారట. అయితే, సాహో విషయంలో, ప్రభుత్వం అలాంటి అనుమతులేవీ ఇవ్వకపోవడంతో, తమకు ఇస్తారో లేదోనన్న టెన్షన్‌ పట్టుకుందట సైరా యూనిట్‌కు. అదనపు షోలు వేస్తేనే, వీలైనంతగా తొలివారంలోనే ఎక్కువ కలెక్షన్లు వస్తాయని భావించిన నిర్మాతలు, ప్రభుత్వంలోని కీలక మంత్రులతో లాబీయింగ్ చేసి, చివరికి అనుమతి తెచ్చుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే షోలు వేసేందుకు పర్మిషన్ ఇఫ్పించుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే, అదనపు షోల పర్మిషన్ వెనక, మంత్రివర్గంలో కొందరు చిరంజీవి సన్నిహితులు చక్రంతిప్పారన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా మంత్రులు.

లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టిన ఆంధ్రలో సైరా అదనపు ఆటల వ్యవహారం సుఖాంతం కావడం, వెనక పెద్ద తతంగమే జరిగిందట. సినిమా రంగం వైపు నుంచి ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ తదితరులు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డిల ద్వారా ప్రయత్నించారట. అయితే ఎలా వుంటుందో పరిస్థితి అని మెగాస్టార్ మూడురోజులు ముందుగానే తన సన్నిహితుడు, రాష్ట్రమంత్రి కన్నబాబుకు చెప్పారని సమాచారం. మెగాస్టార్‌తో వున్న సాన్నిహిత్యం, తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి, తొలిసారి ఎమ్మెల్యేను చేసారన్న గౌరవం కలిసి, కన్నబాబును రంగంలోకి దిగేలా చేసాయట. దీంతో కన్నబాబు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, అదనపు షోలకు పర్మిషన్‌ ఇప్పించడంలో సక్సెస్‌ అయ్యారట.

అట్నుంచి సుబ్బారెడ్డి ఇట్నుంచి కన్నబాబు నరుక్కు రావడంతో ఆంధ్రలో సైరా అదనపు ఆటల వ్యవహారం కొలిక్కి వచ్చిందట. అయితే వాస్తవానికి మొన్న ఎన్నికల ముందు కన్నబాబును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విపరీతంగా టార్గెట్ చేసారు. ప్రజారాజ్యం విలీనంపై అన్నయ్య చిరంజీవిని తప్పుదోవ పట్టించింది కన్నబాబేనని తీవ్ర పదజాలంతో దూషించారు. కాకినాడ వెళ్లి మరీ తిట్ల దండకం అందుకున్నారు. కానీ మెగాస్టార్‌కు మాత్రం, తమ్ముడికి వున్నంత కోపం, కన్నబాబుపై లేదని తెలుస్తోంది. ఎందుకంటే, మొన్న కన్నబాబు సోదరుడు మరణించడంతో, కన్నబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి, సానుభూతి వ్యక్తం చేయడానికి, ఏకంగా చిరంజీవే అక్కడికి వెళ్లారు. చిరు-కన్నబాబు మధ్య అంతగా విభేదాల్లేవని, ఈ ఘటనతో అర్థమైంది. తాజాగా సైరా సినిమా అదనపు షోల అనుమతి కోసం, ఏకంగా చిరంజీవి కన్నబాబుతో మాట్లాడారట. దీంతో మెగాస్టార్ మీద వున్న అభిమానం, విశ్వాసంతో అదనపు ఆటల కోసం ప్రయత్నించేలా చేసాయంటున్నారు ఆయన సన్నిహితులు.

అయితే కన్నబాబు ఒక్కరే కాదు, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా, సైరా అడిషినల్ షోల పర్మిషన్ కోసం, సీఎం జగన్‌తో మాట్లాడారని తెలిసింది. ఇలా కాపు నేతలందరూ చిరంజీవి సినిమా కోసం, ప్రభుత్వ పెద్దలతో పనిగట్టుకుని చర్చించి, అనుమతి ఇప్పించడంలో సక్సెస్‌ అయ్యారన్న చర్చ సాగుతోంది. దీంతో చివరి నిమిషం వరకూ టెన్షన్‌ పడిన చిరు, రామ్‌ చరణ్‌లు, పర్మిషన్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారట.

అయితే అదనపు షోల కోసం పర్మిషన్‌ ఇవ్వడంపై, ప్రభుత్వ వెర్షన్‌ వేరేలా వుంది. మెగాస్టార్‌ అభిమానులు తొలిరోజే సినిమా చూడాలనుకుంటారు కాబట్టి, ఫస్ట్‌ రోజు థియేటర్ల దగ్గర విపరీతమైన రష్‌ వుండే అవకాశముందని, అలాగే తక్కువ షోలుంటే బ్లాక్‌ టికెట్ల మాఫియా కూడా రెచ్చిపోతుందన్న ఆలోచనతో, అదనపు షోలకు పర్మిషన్‌ ఇచ్చామని చెబుతోంది. అదనపు షోల ద్వారా, బ్లాక్‌ టికెట్ల ప్రాబ్లమ్ తక్కువ అవుతుందని, అందరూ సినిమా చూసే అవకాశముంటుందని అంటోంది. మొత్తానికి కారణం ఏదైనా, ఎవరైనా, అదనపు షోలతో కాసుల వర్షం కురుస్తోంది సైరాకు. ప్రభుత్వంలో చిరు సన్నిహితులు ఉండటంతో ఈ పని సులువైందన్న చర్చ జరుగుతోంది.

Full View

Tags:    

Similar News