విద్యార్థుల ఆకలి తీర్చే మధ్యాహ్న భోజనం ఇక నుంచి గోరుముద్దగా రానుంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రోజుకో రకమైన రుచులతో పిల్లల కడుపు నింపనుంది. పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మెనూను ప్రత్యేకంగా తీర్చదిద్దారు. ప్రతీరోజు ఒకేరకమైన భోజనం కాకుండా రోజుకో రకంగా.. విద్యార్థులకు అందజేయనున్న ఆహారానికి సంబందించిన జాబితాను.. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చదివి వినిపించారు.
సోమవారం - అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీటు, చిక్కీ , మంగళవారం - పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం - వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్, చిక్కీ , గురువారం - కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం - అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్, చిక్కీ , శనివారం - అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్ అందజేస్తామని జగన్ ప్రకటించారు.
అదే విధంగా గోరుముద్ద పథకం సాఫీగా అమలయ్యేలా ఆయాల జీతం వెయ్యి నుంచి 3 వేలకు పెంచామని.. అందుకు ఖజానాకు 344 కోట్ల భారం పడుతుందని సీఎం వివరించారు.