Andhra Pradesh: మండపేటలో టీడీపీ వర్సెస్ వైసీపీ

Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ప్రధాన పార్టీలు * బరిలో జనసేన అభ్యర్థులు

Update: 2021-02-24 02:38 GMT

Representational Image

Andhra Pradesh: మండపేటలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. మండపేటలో పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ. అటు మేమూ సిద్ధమంటూ బరిలోకి దిగింది జనసేన. దీంతో మండపేట మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.

తూర్పుగోదావరి జిల్లా మండపేట టీడీపీకి కంచుకోట. అలాంటి మున్సిపాలిటీలో ఈసారి ఆసక్తికర పోరు సాగనుంది. టీడీపీ తమ పట్టు నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా.. ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మరోవైపు జనసేన కూడా అన్ని వార్డుల్లో పోటీకి దిగడంతో ఎన్నికల్లో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

1987లో జరిగిన ఎన్నికల్లో మండపేటను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొలి మహిళా చైర్మన్ గా బిక్కిన విజయ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ప్రతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీదే విజయం. ఇలా మండపేట టీడీపీ కంచుకోటగా మారింది. అయితే ఈసారి వైసీపీ ఇన్‌చార్జ్ తోట త్రిమూర్తులు తన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో మండపేట కైవసం చేసుకోవాలనే ఆలోచనతో వ్యూహాలకు పదును పెట్టారు.

ఇక మండపేట పురపాలక సంఘ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఇరుపార్టీలు తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో నిలిపారు. వైసీపీ నుంచి పతివాడ నూక దుర్గారాణి బరిలో దిగారు. గొల్లపుంత కాలనీ 20వ వార్డులో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తోన్న దుర్గారాణి.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.

ఇక దుర్గారాణికి సమీప బంధువైన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గడి సత్యవతి టీడీపీ చైర్మన్ అభ్యర్ధిగా 12వ వార్డునుండి పోటీపడుతున్నారు. తనను గెలిపిస్తే మండపేట అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు.

ఇక ఎలాగైనా మండపేట మున్సిపాలిటీలో గెలుపు సాధించాలని భావిస్తోన్న టీడీపీ, వైసీపీ ఇప్పటికే ప్రచారాలు ముమ్మరం చేశాయి. అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో చూడాలి మరి. 

Tags:    

Similar News