జేడీతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారన్న ప్రచారంలో నిజముందా?

Update: 2019-08-14 08:54 GMT

జనసేనలో పవన్‌కు-జేడీకి మధ్య దూరం మరింతగా పెరుగుతోందా జేడీ తన ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారా జనసేనకు గుడ్‌ బై చెబితే, మరి ఆయన చేరబోయే పార్టీ ఏది ఏ పార్టీ ఆ‍యనకు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది జనసేనలో విభేదాల కారణంగా, జేడీ లక్ష్మీనారాయణ పార్టీ మారతారన్న ఊహాగానాలు అంతకంతకు పెరుగుతున్నాయ్. అందుకే ఆయన ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠ కూడా పెరుగుతోంది. ఇంతకీ జేడీ దారెటు?

జేడీ లక్ష్మీనారాయణ. జనసైనికుడుగా రాజకీయ ప్రవేశం చేశారు. పవనిజంతో తన ఇమేజ్‌ను కలిపి ప్రజాసేవ చేస్తానంటూ విశాఖ ఎంపీగా పోటీలో నిలిచారు. ఓడిపోయినా, భారీ సంఖ్యలో ఓట్లు కొల్లగొట్టారు. అయితే జనసేన కన్నా, జేడీ సేన మిన్న అన్నట్లు మొదటి నుంచి పార్టీ కన్నా, తన పర్సనల్ ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేశారని విమర్శలు ఎదుర్కొన్నారు జేడీ. ఇప్పుడు అదే జేడీకి పవన్ కు మధ్య వున్న బంధం బెడిసికొట్టేలా చేస్తోందని జనసేనలో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో జనసేనకు బై చెప్పి పువ్వు గుర్తుకు సై చెప్పే పనిలో జేడీ వున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

సీబీఐ జాయంట్ డైరెక్టర్‌గా జేడీ లక్ష్మీనారాయణ అందించిన సేవలు ఆయన ఇంటిపేరును జేడీగా మార్చేసాయి. అధికారిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, నిజాయితికీ, నిబద్దతకు నిలువెత్తు రూపం జేడీ అన్న ఇమేజ్‌ను క్రియేట్ చేశాయి. ఆ ఇమేజ్, జేడిని పాలిటిక్స్ వైపు నడిపించింది. దీంతో ప్రస్తుత పొలిటికల్ పార్టీలకు ప్రత్యామ్నాయం అంటూ పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేనలో చేరిపోయారు జేడీ.

విశాఖ నుంచి జనసేన ఎంపీ టికెట్‌ పొంది ఎన్నికల్లో పోటీ చేశారు జేడీ. కానీ ఎన్నో అంచనాలున్నా, అనూహ్యంగా ఓడిపోయారాయన. అయితే తర్వాత పార్టీకి దూరం జరుగుతూ వచ్చారన్న చర్చ సాగుతోంది. పార్టీ బలాన్ని పెంచాల్సిందిపోయి, పర్సనల్ ఇమేజ్‌ పెంచుకునే ప్రయత్నమే చేశారన్నది పొలిటికల్ కామెంట్స్. దీంతో పవన్ కళ్యాణ్‌తో సఖ్యత చెడినట్టు తెలుస్తోంది. రానురాను పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందని నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణ, తన ముందున్న ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఆ మార్గం కమలమే అన్నది, మరింత హాట్‌హాట్‌గా వినిపిస్తున్న చర్చ.

అయితే మొదటి నుంచి జేడి లక్ష్మీనారాయణపై సానుకూల థృక్పథంతో వున్న బీజేపి, ఎప్పటికప్పుడు జేడికి ఆహ్వానం అందిస్తూనే వుంది. తమ పార్టీలోకి రారమ్మంటూ పిలుస్తూనే వుంది. దీంతో జేడీ కూడా కమలం వైపు మొగ్గు చూపుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. బీజేపిలో చేరేందుకు జేడి ముహార్తాలు చూసుకుంటున్నారని, వన్‌ ఫైన్ డే నిర్ణయం తీసుకోబోతున్నట్టు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జనసేనలో కోల్డ్‌వార్, పార్టీ మార్పు వార్తలపై జేడీ నోరు విప్పితేనే గానీ అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తోంది.

Full View 

Tags:    

Similar News