Prakasam Barrage: శాంతిస్తున్న కృష్ణమ్మ... ప్రకాశం బరాజ్‌కు తగ్గుముఖం పట్టిన వరద
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయి వరద నీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు చేరడంతో ఇదే రికార్డుస్థాయి వరద అంటూ జలవనరుల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Prakasam Barrage: బెజవాడ ప్రజలను భారీ వరదలు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినప్పటికీ ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని చెప్పారు.
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయి వరద నీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు చేరడంతో ఇదే రికార్డుస్థాయి వరద అంటూ జలవనరుల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. పై నుంచి నీటి ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 9 లక్షల 79 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది.
నిన్నటివరకు మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కూడా కాస్త శాంతించింది. బుడమేరు డిజైన్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు చేరడంతో దాని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దీంతో 2 లక్షల 59 వేల మంది వరద బాధితులయ్యారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడ వాసులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. నీటిమట్టం తగ్గడంతో విజయవాడ రామలింగేశ్వర నగర్‌లో వాటర్ వెనక్కి వెళ్తున్నాయి. వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండడంతో స్థానికులు బయటికి వస్తున్నారు. మొన్న రిటైనింగ్ వాల్ లీక్ కావడంతో రామలింగేశ్వర నగర్ సహా పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది.
అటు బుడమేరు, ఇటు కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గడంతో ప్రజలకు కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు.