మంగళగిరి పానకం ప్రత్యేకత ఏమిటో తెలుసా..

మనదేశంలో హిందువులు కొలిచే దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర కలిగిన ఆలయమే పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.

Update: 2020-06-24 07:11 GMT

మనదేశంలో హిందువులు కొలిచే దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర కలిగిన ఆలయమే పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ స్వామి మహత్యం అంతా ఇంతా కాదు. ఈ ఆలయంలో భక్తులు ఏం కోరుకున్నా ఇట్టే జరుగుతుందని ప్రతి ఒక్కరు అంటుంటారు.

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు. కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు. పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవు.

గాలిగోపురం

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది. మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది. దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది.

ధర్మగుణం ఇంకా ఉంది

పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు.

యుగాంతానికి సూచన

యుగాంతాన్ని సూచించే ప్రాంతాల్లో మంగళగిరి స్వామి ఆలయం కూడా ఒకటి. పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యుగాంతానికి ఓ చిహ్నం ఉంది. అది ఏంటంటే యుగాంతానికి ఇక్కడ తయారు చేసే పానకానికి, ఈగలకు, చీమలలు పడతాయని అంటుంటారు.

శాసన స్తంభం

ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసన స్తంభం వీధి అనే వీధి ఉంది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులోను, 4 పర్షియన్ ‍లోను వ్రాసి ఉన్నాయి. 1565 నుండి మంగళగిరి గోల్కొండ కుతుబ్‌ షాహిల పాలనలో ఉండేది. 1593లో కుతుబ్‌ షాహి వృత్తి పన్ను బాగా పెంచేసాడు. అది కట్టలేని చేనేత కార్మికులు మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన సుల్తాను వాళ్ళను వెనక్కి రప్పించమని తన సేనాధిపతి ఖోజా ఆలీని ఆదేశించాడు. ఖోజా ఆలీ పుల్లరి తీసివేస్తున్నట్లు, ఇతర పన్నులను నాలుగు వాయిదాలలో కట్టవచ్చని ప్రకటించి అదే విషయాన్ని ఈ శాసనంపై వ్రాయించాడు.

పెద్ద కోనేరు

మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంది. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోయి, 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయట పడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవి. కోనేటి అడుగున బంగారు గుడి ఉందని ప్రజలు అనుకుంటారని 1883లో గార్డన్‌ మెకెంజీ కృష్ణా జిల్లా మాన్యువల్‌న్‌లో రాసాడు. 19వ శతాబ్దిలో మారెళ్ళ శీనయ్యదాసు కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజలీ కోనేటి నీటితో దేవునికి అభిషేకం జరిపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు.

జయ స్తంభం - కృష్ణదేవరాయల శాసనం

పానకాలస్వామి దేవాలయం మెట్ల మొదట్లో ఈ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 జూన్‌ 23 న శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించి ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని జయ స్తంభం అన్నారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దానశాసనాల ప్రసక్తికూడా దీనిపై ఉంది. దీనిలోని 198వ వరుస నుండి 208వ వరుస వరకు మూడు ముఖ్యమైన చారిత్రక సమాచారాలు ఉన్నాయి.

మంగళగిరి క్షేత్రం ఎక్కడ ఉంది..

మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందింన పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు.


Tags:    

Similar News