నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు.. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చ
సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరగనుంది. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Grama Sabha: ఏపీ వ్యాప్తంగా 13 వేల 326 గ్రామపంచాయతీల్లో నేటి నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరగనుంది. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రామసభలకు సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వానపల్లిలో జరిగే గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసురావారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్నారు సీఎం. మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు కొత్తపేట మండలం వానపల్లికి ఆయన వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటల 35 నిమిషాలకు వానపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు సీఎం చేరుకుంటారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా.. గ్రామసభలో ప్రజలనుద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు హెలికాప్టర్‌లో రాజమండ్రికి పయనమవుతారు. సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు రాజమండ్రి నుంచి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు.