తెలుగు రాష్ట్రాల్లో పడవ ప్రమాదాలు జరుగుతున్నా మనలో కానీ, ప్రభుత్వంలో కానీ కదలిక రావడం లేదు ఎన్ని ప్రమాదాలు జరిగినా అప్పటికప్పుడు కంగారుపడటం బాధపడటం తప్ప ప్రమాదమే జరగకుండా చేపట్టాల్సిన చర్యలను మాత్రం అందరం నిర్లక్ష్యం చేస్తున్నాం. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగి ఉండేది కాదు.
అధికారుల అలసత్వం, పర్యాటక శాఖ అంతులేని నిర్లక్ష్యం అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను బలిగొంది. బోట్ సిబ్బంది కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జరగరాని ఘోరం జరిగింది. లైఫ్ జాకెట్లు ఇవ్వమని ప్రయాణికులు మొత్తుకున్నా పట్టించుకోకపోవడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
గోదావరి నదిలో పడవ ప్రమాదంలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది, అధికారుల అలసత్వం మెయిన్ రీజనైతే, పర్యాటక శాఖ అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. సామర్ధ్యానికి మించి ఎక్కించుకోవడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాల విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు, అంతేకాదు బోటు డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ప్రమాదం నుంచి బయటపడినవాళ్లు అంటున్నారు, తాము పదేపదే లైఫ్ జాకెట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని వాపోతున్నారు.
గోదావరి నదిలో వరద ఉధృతికి ప్రమాదానికి ముందు రెండుమూడుసార్లు కుదుపులకు గురైందని, భయంతో అందరూ బోటును గట్టిగా పట్టుకున్నామని, ఇంతలోనే పడవ తిరగబడిందని అంటున్నారు. లైఫ్ జాకెట్లు సరిపడినన్ని బోటులో ఉండి ఉంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారంటూ కన్నీరు పెడుతున్నారు.
గోదావరినదిలో పడవ ప్రమాదంలో మృతులు భారీ సంఖ్యలో ఉండటానికి కారణం బోటు యాజమాన్య తప్పిదమొక్కటే కాదు మనది కూడా ప్రమాదాలు చెప్పి రావు అందుకే ఇలాంటి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. తెలుగు రాష్ట్రాల్లో పడవ ప్రమాదాలు ఎక్కువే జరుగుతున్నాయి. అయినా అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ, మనం కానీ జరిగిన ప్రమాదం నుంచి కొత్త పాఠం నేర్చుకోవడం లేదు.
నదులు, కాల్వల్లో ప్రయాణాలప్పుడు లైఫ్ జాకెట్ ధరించడం తప్పనిసరి. ప్రత్యేకించి ఇలా జల విహారం చేసే టూరిస్టులు ఈ సాధనాన్ని వాడటం అత్యవసరం. అసలు లైఫ్ జాకెట్ ఎలా పనిచేస్తుంది. మనం నీటిలో పడిపోయినప్పుడు తల మునగకపోతే ప్రాణాపాయం ఉండదు నీళ్లు మింగకుండా తల నీటిపైనే ఉండేలా చేయడమే లైఫ్ జాకెట్ పని మనిషి శరీర బరువులో ఒక పౌండును మాత్రం తగ్గించుకోగలిగితే తల నీటిపై తేలియాడుతుంది. ఆ ఒక్క పౌండు బరువును తగ్గించడమే లైఫ్ జాకెట్ పని లైఫ్ జాకెట్ ధరించినప్పుడు మన ముఖంపైకి నీరు రాకుండా కాపాడటమే కాదు మనల్ని నీటిపై తేలియాడేలా చేస్తుంది. లైఫ్ జాకెట్ ధరించిన వారు కనీసం అయిదారు గంటల వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిపై తేలియాడవచ్చు.
గోదావరి నది పడవ ప్రమాదంలో మృతులు లైఫ్ జాకెట్ ధరించి ఉంటే బతికి ఉండేవారు అసలు పడవ ఎక్కినప్పుడు విధిగా లైఫ్ జాకెట్ అడగాల్సిన బాధ్యత మనది. అది లేని బోట్లు ఎక్కడం ఆపేయడమే కాదు ఆ యాజమాన్యంపై ఫిర్యాదు చేయడం మన బాధ్యత. ఇవేమీ చేయకుండానే ప్రభుత్వాలను నిందించడం ఎంత వరకూ సమంజసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అసలు ప్రమాదమే జరగదు కదా.