అనుకున్నదే అయ్యింది. ఊహించిందే జరిగింది. టీడీపీ కీలక సమావేశానికి ఆ ఇద్దరు కీ లీడర్లు, డుమ్మాకొట్టారు. పార్టీ జంపింగ్ వార్తలకు మరింత ఊతమిచ్చారు. ఇంతకీ వారిద్దరూ ఎవరో అర్థమైంది కదా కేశినేని నాని, గంటా శ్రీనివాస్. ఇంతకీ ఈ ఇరువురు నాయకులు పార్టీ మీటింగ్‌కు ఎందుకు అటెండ్ కాలేదు దీని వెనక అంతులేని కథేంటి?
టీడీపీ విస్తృతస్థాయి మీటింగ్‌కు విజయవాడ ఎంపీ కేశినేని, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాకపోవడం చర్చనీయాంశమైంది. సమావేశానికి డుమ్మా కొట్టడంతో, వీరిద్దరిపై కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారానికి మరింత బలమిచ్చినట్టయ్యింది.
తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన పంతం పాటించారు. టీడీపీలోనే ఉంటూ, విమర్శలు కురిపిస్తున్న నాని, విజయవాడలోనే జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాలేదు. మీటింగ్‌కు నాని రాకపోవడం ఏంటని పార్టీ సీనియర్లు సీరియస్‌గా మాట్లాడినట్టు తెలిసింది. కొద్దికాలంగా కేశినేని నాని సొంతపార్టీపైనే ట్విట్టర్, ఫేస్‌బుక్ వేదికగా విమర్శలు చేస్తుండటం, తాజాగా పార్టీ మీటింగ్‌కు అటెండ్ కాకపోవడంతో, ఆయన బీజేపీకి మరింత చేరువవుతున్నారన్న ఊహాగానాలకు ఊతమిచ్చినట్టయ్యింది. బుద్దా వెంకన్నపై నాని తిట్ల దండకంపై కూడా చర్చ జరిగింది. దీంతో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునేవాళ్లు, వెంటనే వెళ్లిపోవాలి కానీ, పార్టీకి చేయాల్సిన నష్టం చేసే మాటలు మాట్లాడ్డం ఎందుకని సీనియర్ నేతలు అన్నట్టు తెలిసింది. నానిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బాబుకు కొందరు నేతలు చెప్పారని సమాచారం. దీనిపై బాబు మాత్రం మౌనమే వహించినట్టు తెలిసింది.
ఇక మరో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా, పార్టీ మీటింగ్‌కు రాలేదు. ఈయన కూడా బీజేపీలోకి వెళతారన్న టాక్ నడుస్తోంది. తనతో పాటు మరో 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను, తన వెంట తీసుకెళ్తారని, అందుకోసం సరైన టైం కోసం చూస్తున్నారన్న ప్రచారం వుంది. బీజేపీలోకి వెళ్లాలన్న ఆలోచన ఉన్నందుకే, ఆయన పార్టీ మీటింగ్‌కు రాలేదని తెలుస్తోంది. అయితే పీఏసీ ఛైర్మన్‌గా తనను పరిశీలించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నందుకే, సమావేశానికి గంటా రాలేదన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి నాని, గంటా డుమ్మాపై పార్టీ మీటింగ్‌లో ఘాటుగానే చర్చ జరిగింది. గంటా, నానిలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీనియర్లు బాబుకు చెప్పారట. చూడాలి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే నేతలపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.