Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 30 గంటల సమయం
Tirumala: బ్రహ్మోత్సవాలు ముగిసినా భారీగా పెరిగిన రద్దీ
Tirumala: తిరుమలకు భక్తులు పొటెత్తారు. శ్రీవారి దర్శనానికి 30 గంటలు సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఇంత భారీగా రద్దీ పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమిళులకు ఎంతో పవిత్రమైన పెరటాసి మాసం, మూడవ శనివారం కావడంతో భక్తుల రద్దీ పెరుగుతుందన్న ఆంచనాతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం తాత్కలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. దీని వల్ల భక్తులు వర్షంలో తడవకుండా క్యూలైన్లలో వెళ్తున్నారు. మరోవైపు దసరా సెలవులతో పాటు.. ఉద్యోగులకు వరస సెలవులు రావడంతో భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి.
తిరుమలలో ఈనెల 4 వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ 5వ తేదీ మధ్యాహ్నం నుండి క్రమంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండి, 5 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఇప్పుడు క్యూలోకి ప్రవేశించిన భక్తుడికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది.