కరోనాతో కలవరపడుతున్న సిక్కోలు ప్రజలు.. ఆస్పత్రి పేరు చెబితేనే చాలు..

Update: 2020-08-17 10:51 GMT
Coronavirus

కరోనా మహమ్మారి సిక్కోలు ప్రజల వెన్నులో వణుకుపుట్టిస్తోంది మూడు కేసులతో మొదలైన వైరస్ రోజుల వ్యవధిలో పదుల నుంచి వందలకు ఎగబాకింది. ఇప్పటివరకు 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయినా బాధితులు ఆసుపత్రులలో చేరేందుకు విముఖత చూపుతున్నారు. కోవిడ్ ఆసుపత్రి పేరు చెబితేనే చాలు వామ్మో వద్దంటున్నారు. కారణం తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ.

జిల్లాలో కరోనా బారిన పడిన వారికి జెమ్స్ ఆసుపత్రితో పాటు రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. వీటికి తోడు 3 ప్రైవేట్ ఆసుపత్రులను కొవిడ్ సెంటర్లుగా నిర్ణయించారు అధికారులు. కానీ ఈ ఆస్పత్రుల వద్ద నెలకొన్న పరిస్థితులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలే ఇందుకు ఉదహరించవచ్చు. శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను రిమ్స్‌కు తీసుకువచ్చారు. సమయానికి వైద్యం అందక ఆమె అక్కడే మృతి చెందింది. ఇక మరో యువకుడు జ్వరం, ఆయాసంతో బాధపడుతూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తొలుత ఆక్సిజన్ అమర్చిన వైద్యులు పర్యవేక్షణ చేయకపోవడంతో పరిస్థితి విషమంగా మారి మృతి చెందాడు.

పలాసకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ రిమ్స్ లోని నాన్-కోవిడ్ విభాగంలో చేరాడు. కానీ అక్కడి వైద్య సిబ్బంది సరిగ్గా స్పందించకపోవడంతో ఆయన అక్కడే కన్నుమూశారు. ఇక ఇచ్ఛాపురంనకు చెందిన ఓ వృద్ధుడు కరోనా చికిత్స కోసం జెమ్స్‌లో చేరి కనిపించకుండా పోయాడు. గార మండలానికి చెందిన వెంకటరావు కరోనాతో రిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జెమ్స్‌కు తరలించారు. కానీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించలేదు. దీంతో అతడి కుమారుడు హెల్ప్ లైన్ సిబ్బందిని నిలదీయగా మృతి చెందాడని చావు కబురు చల్లగా చెప్పారు. కనీసం తన తండ్రి మృతదేహాన్ని ఇవ్వాలని కోరగా మృతదేహాన్ని దహనం చేశామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

ఇలా రాజాం, పాలకొండ ప్రాంతాల్లోనూ ఇదే విధమైన ఘటనలు జరిగాయి. దీంతో వైరస్ బారిన పడినా బాధితులు ఆసుపత్రి వచ్చేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ రోగులు సైతం ఆసుపత్రులకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొవిడ్ ఆస్పత్రుల్లో పరిస్ధితులు చక్కబెట్టాలని కోరుతున్నారు.

Tags:    

Similar News