Chandrababu Naidu: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటన

Update: 2024-09-02 10:57 GMT

Chandrababu Naidu

Chandrababu Naidu: కుండపోత వాన, వరదలకు విజయవాడ అతలాకుతలం అయింది. ముంచెత్తిన వరదలతో పట్టణం జలదిగ్బందంలో చిక్కుకుంది. కాలనీలు మొత్తం చెరువులుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా భుజాలకుపైనే వరద నీరు నిలిచిపోయింది. విజయవాడ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇంట్లో వరద నీరు.. బాధితుల కంట్లో కన్నీరుతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. సర్కార్‌ ముందుస్తు చర్యలతో కొంతమేర ప్రాణ, ఆస్తి నష్టం తప్పినా.. ముంపు ముప్పుతో బాధితులు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటు సర్కార్ కూడా.. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆహారం, వాటర్, మందులను పంపిణీ చేస్తున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు..పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటన కొనసాగింది. యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్‌, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ పర్యటించారు. వాహనం వెళ్లగలిగినంత దూరం అందులో.. మిగిలిన చోట్ల కాలినడక వెళ్లారు. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. బురదలో కాలినడకనే తన పర్యటనను కొనసాగించారు.

మరింత ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకుని వారితో స్వయంగా మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని.. ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించారు చంద్రబాబు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగిసిన అనంతరం విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం మరోసారి సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో వేగం పెంచి ప్రజలకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఊహించని విపత్తు నుంచి ప్రజలను త్వరగా కాపాడాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రత తమ బాధ్యత అని, బాధితులు ధైర్యంగా ఉండాలని కోరారు.

Tags:    

Similar News