AP News: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే వైసీపీకి ప్రధాన అస్త్రం.. హోంమంత్రి ఫుల్‌స్టాప్ పెట్టినా, ఆగని రగడ..

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షానికి అస్త్రంగా దొరికాయి.

Update: 2024-11-05 17:57 GMT

AP News: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే వైసీపీకి ప్రధాన అస్త్రం.. హోంమంత్రి ఫుల్‌స్టాప్ పెట్టినా, ఆగని రగడ..

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షానికి అస్త్రంగా దొరికాయి. ప్రభుత్వ పనితీరుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే నిదర్శనమని వైఎస్ఆర్ సీపీ విమర్శలు చేస్తోంది. ఈ వ్యాఖ్యలతో హోంమంత్రిత్వ శాఖ నుంచి అనితను తప్పిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. మరోవైపు పవన్ వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటున్నట్టు ప్రకటించి హోంమంత్రి అనిత ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. పోలీసులపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు నిరాకరించారు.

పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 4న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొల్లప్రోలు సభలో ఆయన ప్రసంగించారు. ఒక సీఎంను చంపుతామని బెదిరించిన వాడిని ఎందుకు వదిలేశారు, నాడు ఇచ్చిన స్వేచ్ఛ ఫలితాలివి అని ఆయన మండిపడ్డారు. ఇళ్లలోకి వచ్చి ఏమైనా చేస్తామని కొందరు నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛగా చెబుతున్నారు. అంటే నేరగాళ్లను రోడ్లపై వదిలేయాలా ? చర్యలు తీసుకునే ధైర్యం లేనప్పుడు పోలీసులు ఎందుకు? రాజకీయ నాయకులు , ఎమ్మెల్యేలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాను హోంశాఖను అడగలేక కాదు.. తీసుకున్నానంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. తప్పులు చేసిన వారిని మడత పెట్టి కొట్టాలని ఆయన కోరారు. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి.. గుర్తు పెట్టుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

పాజిటివ్ గా తీసుకున్నా: హోంమంత్రి అనిత

ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. ఏ సందర్భంలో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ తనకు చెప్పారని ఆమె మీడియాకు చెప్పారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలను సహించబోమని ఆమె చెప్పారు. ఎవరో తమ ఇళ్లలోకి ఆడపిల్లల మీదకు వస్తామని బెదిరిస్తుంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా అని ఆమె ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను పరిగణనలోకి తీసుకుని పని చేస్తామన్నారు. తాను ఇంకా పకడ్బందీగా పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పనిచేస్తాయని ఆమె చెప్పారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే శాంతి భద్రతల పోర్ట్ ఫోలియో ఉంది. ఈ విషయం తెలియకుండానే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారా అంటే అనుకోలేం. చంద్రబాబు తర్వాతి స్థానంలో ఉండి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు కారణమయ్యాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ బ్రహ్మస్త్రాన్ని అందించినట్టైంది. అన్యాయం జరిగితే సహించబోమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చని కొందరు జనసేన నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిని తన మాటల ద్వారా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే అందుకు టీడీపీదే బాధ్యత వహించాల్సి ఉంటుందని పరోక్షంగా తన వ్యాఖ్యల ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు సీ. కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అనిత పేరుతో చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.

జమిలి ఎన్నికలు

రాష్ట్రంలో ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దెందులూరు, పిఠాపురం వంటి నియోజకవర్గాలు సహా పలు చోట్ల రెండు పార్టీల కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన ఘటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు చింతమనేని ప్రభాకర్ సీరియస్ గా స్పందించారు. కూటమి విజయం కోసం పనిచేయని వారంతా ఇప్పుడొచ్చి పెత్తనం చేయాలని చూస్తున్నారని విమర్శలు చేశారు. పిఠాపురంలో కూడా ఎన్నికల తర్వాత జనసేనలో చేరిన నాయకుడు ఒకరు మూడు పార్టీల సమావేశంలో గొడవ చేసేందుకు ప్రయత్నించారని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే 11 అసెంబ్లీ స్థానాల్లో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం కుదరలేదు. అయితే ఎన్నికల తర్వాత కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని అభిప్రాయాన్ని జనసేన నాయకుడు ఒకరు ఇటీవల ఓ టీవీ డిబేట్ లో వ్యాఖ్యానించారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. జమిలి ఎన్నికలకు తాము కూడా సిద్దమేనని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అయితే జమిలి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ కూడా లేకపోలేదు.

రౌడీలు గుండాలను వదలొద్దు

రాష్ట్రంలో పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా తన మనసులోని మాటలను బయటపెడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పోలీసులు సరిగా వ్యవహరించడం లేదని తన మాటల ద్వారా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు,దౌర్జన్యాల విషయంలో ఆయన సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు మెత్తబడిపోయారా? లేక భయపడుతున్నారా అని ప్రశ్నించారు. నవంబర్ 5న పల్నాడు జిల్లాలో పర్యటన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్లలో తప్పులు జరిగాయి: ఏపీ డీజీపీ

పోలీస్ శాఖపై రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే గత ఐదేళ్లలో తప్పులు జరిగిన విషయం వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు కూడా భాగస్వామే

రాష్ట్రంలో చంద్రబాబు పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని వైఎస్ఆర్ సీపీ ఆరోపణలు చేస్తోంది. ఇందుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆ పార్టీ ఉదాహరణగా చెబుతోంది. అత్యాచారాలు అరికట్టడంలో హొంశాఖ మంత్రి ఫెయిలైతే అది కేబినెట్ సమిష్టి బాధ్యత కాదా ... దీనికి చంద్రబాబు బాధ్యుడు కాదా అని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది.ఈ పాపంలో పవన్ కళ్యాణ్ కు కూడా భాగస్వామ్యం ఉందని ఆ పార్టీ చెబుతోంది.

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. అయితే ఈ విషయమై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు మంత్రులకు సూచించారని సమాచారం. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు ఎలా స్పందిస్తారోననేది అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Tags:    

Similar News