గన్నవరంలో టీడీపీకి కొత్త ఇంఛార్జ్.. ఊహించని నాయకుడికి బాధ్యతలు
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంచార్జ్ ని నియమించారు చంద్రబాబు. వల్లభనేని వంశి తిరుగుబాటుతో ఆ పార్టీ ఈ నిర్ణయం..
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంచార్జ్ ని నియమించారు చంద్రబాబు. వల్లభనేని వంశి తిరుగుబాటుతో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.. ఒకరిద్దరి పేర్లు పరిశీలించిన అనంతరం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు. దీంతో బచ్చుల అర్జునుడు బుధవారం నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.. ఈ సందర్బంగా పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. కాగా గన్నవరం ఇంచార్జ్ పదవికి ఎక్కువమందే పోటీ పడ్డారు.
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ఇంచార్జ్ పదవిని ఆశించారు. అయితే ఆమె భర్త విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో మరొకరికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఆమెకు ఇంచార్జ్ బాధ్యతలు నిరాకరించారని తెలుస్తోంది. అలాగే రావి వెంకటేశ్వరరావు తన పేరును కూడా పరిశీలించాలని కోరారు. ఆయనను కూడా చంద్రబాబు పక్కనపెట్టి అర్జునుడికి బాధ్యతలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కాగా 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ మోహన్ విజయం సాధించారు. కొద్ది రోజులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధిష్టానం వంశీని సస్పెండ్ చేసింది.