Atmakur By Election: ఆత్మకూరు ఉప ఎన్నికకు మోగిన నగరా
*జూన్ 6వరకు నామినేషన్లు, 23న పోలింగ్, 29న ఫలితాలు
Atmakur By Election: ఏపీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఎన్నికల యంత్రాంగం, గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆత్మకూరు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జూన్ 6 వరకు నామినేషన్లు, 9వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 23న పోలింగ్, 29న ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల యంత్రాంగం గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గౌతం రెడ్డి వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ విక్రమ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. విక్రమ్ రెడ్డి పేరును వైసీపీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నామినేషన్ల కోలాహలం మొదలైంది. ఇవాళ తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా రమేష్ నవతరం పార్టీ తరపున రావు సుబ్రహ్మణ్యం నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీతో పాటు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి చేవూరు శ్రీధర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. బీజేపీ అభ్యర్థిత్వంపై ఇంకా స్ఫష్టత రాలేదు.
మరోవైపు ఉప ఎన్నిక నిర్వహణకు తాము సన్నద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆత్మకూరులో మకాం వేశారు. నామినేషన్ల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు దృష్టి పెట్టారు.