
Bird Flu
Bird Flu: బర్డ్ ఫ్లూ వైరస్ తో ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించడం కలకలం రేపుతోంది. పచ్చికోడి మాంసం తినే అలవాటుతోపాటు రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. బర్డ్ ఫ్లూ వల్లే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. మార్చి 16న బాలిక మరణించింది. పలు స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధ్రువీకరించారు. బర్డ్ ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
కోడి కూర కోసే సమయంలో పాప అడిగితే ఒక్క ముక్క ఇచ్చాము. అది తిన్న తర్వాతే జబ్బు బారిన పడింది. గతంలోనూ ఓసారి ఇలానే ఇచ్చాము. ఉడికించిన మాంసం తిన్న మాకు ఎవరికీ ఏం కాలేదని చిన్నారి తల్లి తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
* కోడి మాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి.
* జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.
*వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, పెద్దలు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకూడదు.
*జ్వరంతోపాటు జలుబు, తీవ్ర స్థాయిలో దగ్గు తదితర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
*కోవిడ్ సమయంలో మాదిరిగా ఆక్సిజన్ లెవల్స్ ను చెక్ చేసుకోవాలి.