AP Mega DSC 2025 Application: ఫీజు లేకుండానే వారు మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు

AP Mega DSC 2025 Application: ఫీజు లేకుండానే వారు మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు
AP Mega DSC 2025 Application: ఏపీ సర్కారు ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 20 నుండి మే 15 వరకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ప్రక్రియను రెండు విభాగాలుగా విభజించారు. పార్ట్ ఏ లో అభ్యర్థుల చిరునామా, అర్హతలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇక రెండో పార్టులో సర్టిఫికెట్స్ జతచేయాల్సి ఉంటుంది. 10వ తరగతి నుండి అర్హత ఉన్న అన్ని సర్టిఫికెట్స్‌ను ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్స్ సబ్‌మిట్ కాని అభ్యర్థులకు హాల్ టికెట్స్ జారీ కావు. ఎందుకంటే, ప్రభుత్వం దృష్టిలో అవి అసంపూర్తి దరఖాస్తులుగానే మిగిలిపోతాయి. దరఖాస్తు గడువు ముగిసేలోగా సర్టిఫికెట్స్ సమర్పించేందుకు అవకాశం ఉంది.
ఏపీ డీఎస్సీ దరఖాస్తుకు చేసుకునే సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పంచాయతీరాజ్, పురపాలక, ఏపీఆర్‌జేసీ, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమశాఖల పాఠశాలల విషయంలో ఆప్షన్స్ ఎంచుకోవాలి. అభ్యర్థులు ఏయే పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారో ఆ వివరాలను ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలి. పరీక్షలో మెరిట్ తెచ్చుకున్న అభ్యర్థులకు ఆ ఆప్షన్స్ ప్రకారమే పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇక ఏపీ మెగా డిఎస్సీ అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే... అభ్యర్థులు ఒక్కో పోస్టుకు రూ. 750 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గత ప్రభుత్వం హయాంలో జారీ అయిన చివరి డీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. కాకపోతే అప్పుడు దరఖాస్తు చేసుకున్న పోస్టులకు అదనంగా దరఖాస్తు చేసుకునే వారు మాత్రం ఆ అదనపు పోస్టులకు అయ్యే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ డీఎస్సీ అభ్యర్థుల వయో పరిమితి:
ఏపీ డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ ఏడాది జులై 1 నాటికి 45 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 49 ఏళ్ల వరకు అవకాశం ఉంది. దివ్యాంగులైన అభ్యర్థులకు 54 ఏళ్ల వరకు వయసు సడలింపు ఉంది. దరఖాస్తు సబ్మిట్ చేసే ముందే అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే ఆ తరువాత ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదు.