
Tirumala Tickets
TTD: తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఎండాకాలం కావడం, పిల్లలకు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీటీడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. భక్తులు దీన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనానికి రావాలని..నిర్ణీత సమయానికి ముందే క్యూలైన్లోకి రావడంతో రద్దీ పెరుగుతోందని టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భక్తులు సహకరించాలని వారు కోరారు.
గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 19న 78,82 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు..అదే రోజు హుండీ ఆదాయం రూ. 3.36కోట్లుగా నమోదు అయ్యిందని టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 20న ఈ సంఖ్య 82,746కు చేరుకుంది. హుండీ ఆదాయం రూ. 3.85కోట్లుగా ఉంది. అయితే ఈ రద్దీలో సర్వదర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 12 నుంచి 15గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.
టీటీడీ భక్తుల సౌకర్యార్థం విస్త్రుత ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లో ఉన్నవారికి భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందిస్తుంది. అయినాకూడా టైమ్ స్లాట్ ను పాటించకపోవడం వల్ల క్యూలైన్స్ అనవసరంగా నిండిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమస్యను నివారించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ సిస్టమ్ ను పరీక్షిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా గంట లేదా రెండు గంటల్లో దర్శనం పూర్తయ్యేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
టీటీడీ భక్తులు స్లాట్ బుక్ చేసుకునేందుకు.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ (https://ttdevasthanams.ap.gov.in) లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఈ విధానం ద్వారా రద్దీని సమర్ధంగా నిర్వహించడంతోపాటు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది.