
Pm modi
Pm modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. రాజధాని అమరావతి నిర్మాణాల పున: ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, సచివాలయం వెనకున్న స్థలంలో బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడినుంచే పనులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి గుంటూరు, క్రిష్ణ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బ్రుందం పర్యవేక్షిస్తోంది.
ఈ కార్యక్రమానికి 5లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు, సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.