Attack on Kethireddy Peddareddy: తాడిపత్రిలో మళ్లీ ఫ్యాక్షన్ టెన్షన్.. కేతిరెడ్డి ఇంటిపై జేసీ వర్గం ఎటాక్
Attack on Kethireddy Peddareddy residence: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం మధ్యాహ్నం తరువాత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హై కోర్టులో బెయిల్ రావడంతో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి చేరుకున్నారు. పెద్దారెడ్డి వచ్చారని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటిని చుట్టుముట్టారు. టీడీపీ కార్యకర్తలను అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి భారీ ఘర్షణకు దారితీసింది. రాళ్లు, ఇటుకలు తీసుకుని ఒకరిపై మరొకరు విసురుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వైసీపీ, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి అదుపుతప్పుతోంది అని గ్రహించిన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుండి తిమ్మాపురం పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేతిరెడ్డి పెద్దారెడ్డికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేతిరెడ్డి తాడిపత్రికి ఎలా వస్తారో చూస్తాం. కేతిరెడ్డి ఊర్లోకి రానివ్వకుండా పోలీసులే బహిష్కరించాలని.. లేదంటే కేతిరెడ్డిని పంచెలూడదీసి కొడాతానని జేసీ హెచ్చరించారు. కేతిరెడ్డి ఫ్యాక్షన్ చేస్తానని బెదిరిస్తున్నాడని.. కానీ ఎలా చేస్తావో తానూ చూస్తానని జేసీ హెచ్చరికలు జారీచేశారు.
అయితే, దాడి జరిగిన సమయంలో కేతిరెడ్డి పెద్దా రెడ్డి అనుచరుడు మురళి కూడా ఆయన నివాసంలోనే ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి రావడానికంటే ముందుగానే పరిస్థితి తీవ్రరూపం దాల్చుతోందని గ్రహించిన మురళి.. ఇంట్లోంచి డబుల్ బ్యారల్ గన్, రివాల్వర్ తీసుకుని ఇంట్లోంచి బయటికొచ్చాకే అప్పటివరకు రాళ్లు విసురుతూ దాడికి పాల్పడిన వారు కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తానికి కేతిరెడ్డి రాకతో తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం కనిపించింది.