AP News: కాక రేపుతున్న ఏపీ పాలిటిక్స్.. ప్రచారంపై పార్టీల ఫోకస్
AP News: లోకేష్ యాత్రకు సీనియర్ల వారసుల సంఘీభావం
AP News: ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే.. పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ.. సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల్లో ఉంటోంది. మిగతా పార్టీలు యాత్రలు, పాదయాత్రలతో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఇప్పటికే జనసేనాని.. వారాహియాత్రతో విడతల వారీగా దూసుకుపోతున్నారు. అవకాశం ఉన్న ప్రతిసారీ.. అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. మరోవైపు.. యువగళం పాదయాత్రతో లోకేష్ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
అయితే.. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న కసితో ఉన్న టీడీపీ.. యువ మంత్రాన్ని జపిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువ సీట్లు కేటాయించేందుకు టీడీపీ హైకమాండ్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌కు.. పలువురు సీనియర్ నేతల వారసులు సంఘీభావం తెలుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతానికి పైగా టికెట్లు యువతకే ఇస్తామని ప్రకటించిన టీడీపీ.. యువరక్తoతో పార్టీని గెలుపుబాటలో పయనించేలా వ్యూహం రచిస్తోంది. గెలుపు గుర్రాల కోసం అంతర్గతంగా సర్వేలు చేయిస్తూ.. నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. మరి టీడీపీ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా..? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? టీడీపీ వ్యూహాలకు వైసీపీ ప్రతివ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది..? ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.