Hema joins in BJP: బీజేపీలోకి వచ్చి రాగానే షాకిచ్చిన సినీ నటి హేమ
Hema joins in BJP: ఇలా కండువా కప్పుకుందో లేదో.. అప్పుడే ఫుల్ కామెడీ పండించింది.
Hema joins in BJP: ఇలా కండువా కప్పుకుందో లేదో.. అప్పుడే ఫుల్ కామెడీ పండించింది. ఏదో మాట్లాడుదామని ఇంకేదో మాట్లాడి నెటిజన్లకు బుక్కైంది. వెండితెరపై నవ్వులు పూయించిన అలవాటు ఎక్కడికి పోతుంది. పొలిటికల్ వేదికపై కూడా అదే కంటిన్యూ చేసింది. చివరకు కావాల్సినన్ని కామెంట్లు, లెక్కలేనన్ని సెటైర్లను సొంతం చేసుకుంది. ఆమె ఇంకెవరో కాదు నటి హేమ.
నటి హేమ బిగ్‌బాస్ -3 తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. సినిమా అవకాశాలు కూడా చెప్పుకోదగ్గ ఏం రాలేదు. ఇప్పుడు సడన్‌గా హేమ బీజేపీ వేదికపై ప్రత్యక్షమై కమలం కండువా కప్పుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హాస్య నటి హేమ.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి 'కమలం' గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ మాట్లాడమని మైక్ ఇచ్చిన పాపానికి పెద్ద రచ్చ చేశారు హేమ. చేరింది బీజేపీలో మాట్లాడాల్సింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి లేదంటే స్టేజ్‌మీదున్న పెద్దల గురించి ప్రసంగించాలి. ఇవేమి పట్టించుకోని హేమ పవన్‌కల్యాణ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. మన అన్న' పవన్ కళ్యాణ్ సినిమా 'వకీల్ సాబ్' చూసొచ్చానంటూ గట్టిగా అరచి మరీ చెప్పారు. పవన్ కల్యాణ్ భజన ఎక్కువైపోతుందని ఓ బీజేపీ నాయకుడు తెగ ఫీలయ్యాడు. హేమ వద్దకు వచ్చి ప్రధాని గురించి మాట్లాడండి అంటూ హేమ చెవిలో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ముచ్చట మైక్‌లో అందరికీ వినిపించింది. దీంతో హేమ అతనిపై కోపంగా, చిరాకుగా ఓ లుక్కెశారు.
తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన హేమ తిరుపతి బీజేపీ అభ్యర్థి పేరు పలకడానికి ఇబ్బందిపడ్డారు. పక్కన ఉన్న వారు 'రత్నప్రభ' అని అందించడంతో హేమ సీరియస్ అయ్యారు. నాకు అన్నీ తెలుసు మీరేమీ చెప్పొద్దంటూ క్లాస్ పీకారు. పార్టీలో చేరిన వేదికపైనే బీజేపీ నేతలకు ఓ రేంజ్‌లో షాకిచ్చారు హేమ.
నాకు అన్నీ తెలుసు, మీరేమీ చెప్పొద్దు అంటూ బీజేపీ నాయకులపై ఫైరైన హేమ ఆ వెంటనే భయంకరమైన మిస్టెక్ చేసి, నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. జరిగేది లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికైతే రత్నప్రభను అసెంబ్లీకి పంపాలని చెప్పి, నవ్వులపాలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేసవిని మరింత హీటెక్కించేలా తిరుపతి ఉపఎన్నిక జరుగుతుంది. పొలిటికల్ స్పీచ్‌లు మరింత కాక పుట్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నటి హేమ స్పీచ్ కాస్త రిలీఫ్ ఇచ్చినట్లయిందని సోషల్‌మీడియాలో కామెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకస్తున్నాయి. మొత్తానికి హేమ వచ్చిరాగానే బీజేపీ నేతలకు చుక్కలు చూపించిందన్నమాట.