సోషల్ మీడియాపై నజర్..రూల్స్ బ్రేక్ చేశారో..
* అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు-డీజీపీ * సోషల్ మీడియాపై నిఘా పెట్టాం-డీజీపీ
DGP Mahender Reddy Press Meet : తెలంగాణ శాంతి భద్రతలకు నిలయంగా ఉందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు ఆయన. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకొని విధ్వంసక శక్తులు మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యవహిరిస్తే కఠినచర్యలు తప్పవని.. కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అలాంటి చర్యలను పోలీసుశాఖ అణచివేస్తుందన్నారు.
సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. ప్రజలందరూ పోలీసులతో భాగస్వామ్యం కావాలని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందన్నారు. మూడు కమిషనరేట్ పరిధి లో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, రొచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. ఇప్పటి వరకు 50 కేసులు నమోదు చేశామని, అవన్నీ విచారణలో ఉన్నాయని, చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు.