అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై షర్మిల ప్రకటన.. అక్కడినుంచే ఎందుకో తెలుసా?
YS Sharmila: ఖమ్మం జిల్లా పాలేరులో భారీ విజయంతో YSRTP తొలి జెండా ఎగరాలని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పిలుపిచ్చారు.
YS Sharmila: ఖమ్మం జిల్లా పాలేరులో భారీ విజయంతో YSRTP తొలి జెండా ఎగరాలని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పిలుపిచ్చారు. YSR బిడ్డగా తనను పాలేరు నియోజకవర్గం ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సాఆర్ కు వేలాది మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. వైఎస్ ఫోటోతోనే ఎన్నికల్లో కొందరు నేతలు గెలుస్తున్నారని చెప్పారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి పాలేరు నియోజక వర్గం ఒక దిశా, నిర్దేశం కావాలన్నారు షర్మిల. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆమె ఇవాళ ఖమ్మం జిల్లాలో ముగించారు. ఇక పాలేరు ఎందుకంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే జనరల్. కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం. వీటిలో ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికి పట్టుంది. ఖమ్మం ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రి పవ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. కొత్తగూడెంలో బీసీలు ఎక్కువ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరావు గెలిచారు.
పాలేరులో మాత్రం రెడ్డిలదే ఆధిపత్యం. ఇక్కడ ఎక్కువసార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్సే. మూడుసార్లు వామపక్షాలు పాగా వేయగా.. ఒకసారి బైఎలక్షన్లో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టినా గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరారవు ఓడిపోవడానికి సామాజిక ఈక్వేషన్స్ కారణమని చెబుతారు. ఇవన్ని పరిశీలించాకే పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయించారని తెలుస్తోంది.