డిజిటల్ బాటలో విద్య సరే.. అసలు విద్యాసంవత్సరం మొదలవుతుందా?

Update: 2020-08-14 06:21 GMT

Will academic year begins: కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి అసలు ఈసారి విద్యా సంవత్సరం మొదలవుతుందా అనే సందేహం అటు విద్యా సంస్థలతో పాటు ఇటు తల్లిదండ్రుల్లో అయోమయం పరిస్థితి ఏర్పడింది. ఐతే ఈ గందరగోళం పరిస్థితికి తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. విద్యా సంస్థలు ప్రారంభమయ్యే వరకు ఆన్ లైన్లో క్లాసులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఐతే అది ఎంతవరకు అమలుకు నోచుకుంటుందనే సందేహాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

తెలంగాణలో ఈనెల 17వ తేదీ నుంచి పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు మొదలవుతున్నాయి. ఆగిపోయిన ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షలు మళ్లీ జరిగుతున్నాయి. ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకుశ్రీకారం చుట్టారు. దోస్త్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. వీటి అన్నింటిపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కానీ విద్యాసంస్థలు ఎప్పటి నుంచి తెరుచుకుంటాయన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు స్తబ్ధంగా ఉన్న విద్యార్థి లోకంలో కదలిక వచ్చింది. అయితే ఇవన్నీ డిజిటల్ రూపంలో జరుగుతాయని చెప్పడంతో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నలు మొదలు అయ్యాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈనెల 20 నుంచి టీశాట్‌ ఛానెళ్లు, దూరదర్శన్‌ యాదగిరి ఛానెల్‌ ద్వారా రికార్డు చేసిన డిజిటల్‌ పాఠాలు ప్రారంభిస్తారు. 3 నుంచి 5 తరగతులకు సెప్టెంబరు 1 నుంచి డిజిటల్‌ పాఠాలు మొదలవుతాయి. వీరికి రికార్డు చేసిన పాఠాలు కాకుండా ప్రత్యక్షంగా బోధిస్తారు. అంటే ఉపాధ్యాయులు టీవీ స్టూడియోలకు వెళ్లి తరగతి గదిలో మాదిరిగా బోధిస్తుంటే దాన్ని ప్రసారం చేస్తారు. ఇక 1, 2 తరగతులకు పాఠాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చిన్న పిల్లలైనందున వారికి డిజిటల్‌ పాఠాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏ తరగతికి ఎన్ని గంటలపాటు తరగతులు ఉంటాయన్నది రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. అయితే ఎంట్రన్స్ పరిక్షలతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో తరగతుల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రైవేటు స్కూళ్లల్లో ఎప్పుడు తరగతులు ప్రారంభం అవుతాయో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

Tags:    

Similar News