సీఎం కేసీఆర్.. టార్గెట్ మోడీ రీచ్ అవగలరా?
KCR: జాతీయ రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తారా?
KCR: జాతీయ రాజకీయాలను శాసించాలని చూస్తున్న సీఎం కేసీఆర్ తన లక్ష్యాన్ని చేరుకోగలరా? 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు సాధించలేనిది, కేసీఆర్ సాధించి చూపెట్టగలరా? పరిమిత బలమున్న తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో రాణించేలా అధినేత రచిస్తున్న వ్యూహాలు ఏంటి? మోడీతో పెట్టుకుంటే టీడీపీ అధినేతకు ఏమైందో గుర్తు చేసుకోమంటూ కమలం క్యాంప్ హెచ్చరిస్తుంటే, మా వ్యూహాలు మాకున్నాయంటున్న గులాబీ దళంలో కనిపిస్తున్న ఆ ధీమా ఏంటి? ఇంతకీ గులాబీ అధినేత అమ్ములపొదిలో ఉన్న ఆ అస్త్రాలు ఏంటి? సీఎం కేసీఆర్ టార్గెట్ మోడీ అంటూ చెలరేగిపోవడం వెనుకున్న ఆయన ఎత్తుగడలు ఏంటి?
ఇదీ బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెబుతున్న మాట. ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ స్థాయిలో హడావిడి చేసేంత స్థాయిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేదు అంటున్నారీయన. ఆన్ రికార్డ్‌గా కాదు కానీ ఆఫ్ ద రికార్డ్‌గా కూడా కమలం నేతలు ఇంకో మాట కూడా అంటున్నారు. మోడీతో పెట్టుకుంటే ఏపీలో టీడీపీకి ఎదురైన అనుభవమే టీఆర్ఎస్‌కు ఎదురు కాక తప్పదని చెబుతున్నారు. గులాబీ నేతలు కూడా దీనికి ధీటుగానే బదులిచ్చారు. చంద్రబాబుకు అయితే అయ్యిండొచ్చేనేమో కానీ, ఇదే మోడీతో పెట్టుకున్న మమతాబెనర్జీ బెంగాల్ పీఠమెక్కలేదా, మోడీని ఎదురించి నిలిచి గెలవలేదా? అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా మా వ్యూహాలు మాకున్నాయంటోంది గులాబీ క్యాంప్. ఇంతకీ ఏంటవి?
గులాబీ బాస్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన మార్కు చూపాలని భావిస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్‌ను, బీజేపీ పాలకులను గద్దె దించాలని వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా ముందుకు వచ్చి మద్దతు ఇస్తున్నారు. కాకపోతే, ఇందాక జీవీఎల్ అన్నట్టు ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలు ఇంతకుముందు కూడా చాలానే చేసిన కేసీఆర్ గత సార్వత్రిక ఎన్నికల ముందు విఫల ప్రయత్నాల అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో అవి ఏ మేరకు ఫలిస్తాయన్నదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో జరుగుతున్న చర్చ.
ఇందుకు ఏపీలో చంద్రబాబు అనుభవాన్ని కమలం నేతలు గుర్తుచేస్తున్నారు. నాలుగేళ్ల పాటు కేంద్రంతో దోస్తీ కట్టిన చంద్రబాబు 2018 మార్చిలో తెగదెంపులు చేసుకున్నారు. నాడు బాబు చెప్పిన కారణం ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభజన హామీలు అమలు చేయలేదనే సాకుతో కేంద్రంపై కత్తి కట్టారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చెప్పిన సందర్భాలు ఎన్నో. అంతకు ముందు, పాలూ నీళ్ళుగా కలిసోయిన బాబు మోడీ చివరాఖరు ఎన్నికలకు ఏడాది ముందు తప్పంతా కేంద్రానిది నాదు కాదంటూ బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఏపీ ఓటర్లు నమ్మలేదు. దీనికి ముందు కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏపీలో కూర్చోకుండా దేశమంతా కలియతిరిగారు. బెంగుళూరు వెళ్ళి కుమారస్వామిని దేవేగౌడను కలిశారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వంటి వారిని కలిశారు. పశ్చిన బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్‌తో కలసి ఎన్నికల పొత్తు పెట్టుకుని వేదికలను పంచుకున్నారు.
ఇప్పుడు కేసీఆర్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారన్నది కమలం క్యాంప్‌లో జరుగుతున్న చర్చ ఆ మాటకొస్తే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల కంటే బాబే గతంలో గట్టి ప్రయత్నాలు చేశారని చెప్పుకుంటున్నారు. మోడీ హఠావో అన్న నినాదాన్ని కూడా చంద్రబాబు దేశమంతా వినిపించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మోడీని గద్దె దించాలన్న పట్టుదలతో బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మోడీని మరోసారి గెలిపించారని చెబుతున్నారు. అటు నేల విడిచి సాము చేసిన చంద్రబాబును ఏపీ ప్రజలు మాజీ సీఎంను చేశారని, ఇదంతా కళ్ల ముందు జరిగిన అనుభవమేనని అంటగున్నారు. గత పరిణామాలు ఉమ్మడి ఏపీలో సగమైన తెలంగాణాను పాలిస్తున్న కేసీఆర్‌కి ఈ చరిత్ర తెలియనిది కాదంటున్న రాజకీయ పండితులు ఈయన కూడా సేమ్ టూ సేమ్ బాబు బాటలోనే కేంద్రాన్ని విమర్శిస్తున్నారని చెబుతున్నారు. నాడు ఏపీలో మోడీకి టీడీపీ నల్ల జెండాల స్వాగతం పలికితే నేడు కేసీఆర్ తాను స్వాగతం పలకకుండా వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారంటూ ఉదహరిస్తున్నారు.
నాడు చంద్రబాబు అయినా నేడు కేసీఆర్ అయినా సువిశాలమైన దేశంలో పరిమితమైన స్థాయిలో మాత్రమే రాజకీయాలను చేయగలరన్నది విశ్లేషకుల మాట. చంద్రబాబుకు నాడు 25 ఎంపీ సీట్లు అయినా ఉన్నాయి. కానీ తెలంగాణలో కేసీఆర్ పదిహేడే ఉన్నాయని, ఆ సీట్లతో కేసీఆర్ ఢిల్లీలో ఎలా చక్రం తిప్పగలరన్నదే అనుమానమంటూ వారు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీకి 42 సీట్లు, కేజ్రీవాల్‌కి పంజాబ్‌తో కలిపి చూస్తే 25 ఎంపీ సీట్లు ఉంటాయి. దేవెగౌడకు కర్నాటకలో 28 సీట్లు ఉండగా, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు 39 స్థానాలు, మహారాష్ట్రలో ఉద్దవ్‌ఠాక్రేకు 48 ఎంపీ సీట్లు ఉన్నాయి. మరి అందరిలో తక్కువ సీట్లు ఉన్న రాష్ట్రం నుంచి వెళ్ళి కేసీఆర్ ఢిల్లీలో ఏం సాధిస్తారన్నదే అసలు చర్చ.
తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. పరిస్థితులు తారుమారైతే పరిస్థితి ఏంటన్న పాయింట్ కూడా వినిపిస్తోంది. జాతీయ పార్టీల జోరు చూస్తే ఉన్న అధికారాన్ని కాపాడుకోవడం టీఆర్ఎస్‌కు పెద్ద టాస్క్ మారవచ్చంటున్నారు పొలిటికల్ పండితులు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఇలా సెటైర్ వేసి ఉంటారని తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతోంది. ఏమైనా తెలంగాణలో రాజకీయంగా కూసాలు కదిలుతుంటే, జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ దేశాటన చేయడంపై సొంత పార్టీలో కూడా బయటకు రాని చర్చ ఒకటి జరుగుతోందట. బీజేపీ, కాంగ్రెస్ దూకుడును తెలంగాణలో తట్టుకొని నిలబడితే అదే పదివేలు అని భావిస్తున్నారట. ఎందుకొచ్చిన జాతీయ రాజకీయాలని నిట్టూర్పు విడుస్తున్నారట. ఎవరెన్ని చెప్పినా తాను చేయాలనుకున్నది చేసే నైజమున్న కేసీఆర్ మరి ఏ నిర్ణయం తీసుకుంటారో, టార్గెట్ మోడీకి కట్టుబడి ఉంటారో చూడాలి.