మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీనా, రాజ్యసభనా.. రాజ్యసభ రేసులో సురేష్‌కు కొత్త టెన్షన్ ఏంటి?
ఆయన మిస్టర్ కూల్..వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది. రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఆయనకు చెక్కుచెదరని క్యాడర్ ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన ఆయన, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కారెక్కారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మండలి ఛైర్మన్ అవుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజ్యసభ రేసులో ఉన్నారని కొందరంటుంటే, ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని ఇంకొందరంటున్నారు. ప్రతీసారీ ఇదిగో అదిగో అంటూ పదవి ఊరిస్తున్నా ఆయన నెంబర్ మాత్రం ఇప్పటికీ రాలేదు. ఆ మాజీ స్పీకర్ పదవి విషయంలో పొలిటికల్ సర్కిల్ లో జరుగుతున్న చర్చేంటి.. ? అసలు ఆయన పదవికి ఉన్న అడ్డంకులేంటి ?
కే.ఆర్. సురేష్ రెడ్డి రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రికార్డు ఆయనది. 2004లో గెలిచిన తర్వాత సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉమ్మడి రాష్ట్రానికి సేవలందించారు. రాజకీయ విలువలు కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన హస్తం పార్టీ వీడి కారెక్కారు. సురేష్ రెడ్డికి పార్టీలో సముచిత స్ధానం కల్పిస్తామని అనేక వేదికలపై సీఎం కేసీఆర్ హామి ఇచ్చారట. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో సురేష్ రెడ్డి ప్రభావం చూపించారట. ఆయన క్యాడర్ అంతా గులాబీ ఎమ్మెల్యేల గెలుపుకోసం పనిచేశారట. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మండలి ఛైర్మన్ పదవి ఖాయమన్నారట. ఐతే ఎంపీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత ఓటమితో సురేష్ రెడ్డి, పదవీ అవకాశాలకు గండి పడిందనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరుకావడం లేదట. దీంతో కొందరు ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం మొదలెట్టేశారట. అదంతా ఉత్తిదే అని ఆయన క్యాడర్‌కు చెప్పారట. ఎలాంటి పదవులూ లేకుండా పార్టీ కార్యక్రమాల్లో ఏ హోదాలో పాల్గొనాలని దూరంగా ఉన్నానని చెప్పారట. దీంతో ఆ వివాదానికి పుల్ స్టాప్ పడింది. ఐతే తాజాగా మరోసారి ఆయన పదవిపై రాష్ట్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఐతే ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్ధానాలతో పాటు ఎమ్మెల్సీ స్ధానం కోసం సురేష్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టేందుకు అధిష్ఠానం సిద్దంగా ఉన్నా, ఆయన ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారనే ప్రచారం జరిగింది. రాజ్యసభ స్ధానం కోసం పట్టుబడుతున్నారట. ఐతే ఇదే స్థానం కోసం మాజీ ఎంపీ కవిత పేరు పరిశీలనలో ఉండటంతో, సురేష్ రెడ్డికి రాజ్యసభ పదవి దక్కడం అనుమానమే అన్న ప్రచారం ఆయన అనుచరుల్లో జరుగుతోంది. ఇలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి మిస్ అవుతుండటంతో ఆయన పదవులపై ఆశలు వదులుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. సీఎం కేసీఆర్-మంత్రి కేటీఆర్ తో సన్నిహిత సంబంధం ఉండటంతో ఏదో ఒక రకంగా సురేష్ రెడ్డికి న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నారట ఆయన అనుచరులు. ఐతే అది ఎప్పుడు ఎలా అవకాశం కల్పిస్తారన్నది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత ఓటమితో పదవుల అవకాశాలకు గండిపడగా, ప్రస్తుతం రాజ్యసభ రేసులో కవిత ముందు వరుసలో ఉండటం, సురేష్ రెడ్డి కలిసి రావడం లేదట. ఆయనకు అవకాశం ఎప్పుడొస్తుందో అసలు వస్తుందో రాదో తెలియక క్యాడర్ పరేషాన్ అవుతున్నారు. ఐతే ఆలస్యంగానైనా పదవి రావడం ఖాయమని టీఆర్ఎస్ సీనియర్లు చెబుతున్నారట. చూడాలి, ఆయన ఏ పదవితో తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారో.