రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఎటువైపు? అటు జగన్... ఇటు కేసీఆర్
Presidential Election: కొత్త రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుంటే ఏ పార్టీ ఎటువైపు ఓటేస్తోందన్నదానిపై అంతే సస్పెన్స్ నెలకొంది.
Presidential Election: కొత్త రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుంటే ఏ పార్టీ ఎటువైపు ఓటేస్తోందన్నదానిపై అంతే సస్పెన్స్ నెలకొంది. రాష్ట్రపతి అభ్యర్థిని గెలిచే అంత మొత్తం బలం ఎన్డీఏ పక్షాలకు లేకపోవడంతో బీజేపీ ఆచితూచి వ్యవహిరస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నదానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు కమలనాథులు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిని చేస్తారని కొందరు భావిస్తున్నా అలాంటి సిచ్యువేషన్ కన్పించడం లేదని కూడా తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో సౌత్ ఈక్వేషన్‌తో రాష్ట్రపతి అవకాశం ఇస్తారో లేదో అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఎటువైపన్నది టెన్షన్ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు వైఖరుల నడము టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి ఏకపక్షంగా మద్దతిస్తుందా లేదంటే ఏపీ ప్రయోజనాలు కాపాడాలని కోరుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి నిధుల కోసం ఎదురు చూస్తున్న వైసీపీ సర్కారు నిర్ణయం కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్న చర్చ విన్పిస్తోంది. ఎన్డీఏ బలానికి వైసీపీ తోడైతే గెలుపు సునాయాశమన్న భావనలో బీజేపీ ఉంది. మరోవైపు బీజేపీతో అమీతుమీ అంటున్న టీఆర్ఎస్ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ ఢిల్లీ సర్కిల్స్ లో బలంగా విన్పిస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమికి దూరంగా ఉంటున్న టీఆర్ఎస్, బీజేపీకి అంతే దూరాన్ని పాటిస్తోంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.