సిరిసిల్ల కాంగ్రెస్‌లో త్వరలో అదిరిపోయే ట్విస్ట్‌ ఖాయమా?

Update: 2020-07-06 07:29 GMT

ఊరంతా ఓ దారైతే ఉలిపి కట్టది ఇంకో దారనట్టు రాష్ట్రంలో విపక్ష కాంగ్రెస్ కొన్ని జిల్లాల్లో స్పీడ్ పెంచుతుంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కంటికి కూడా కనిపించడం లేదట. ఒకప్పుడు గులాబీ పార్టీ అధినేత, యువరాజుకు కూడా దీటుగా కనిపించిన ఆ నేత ఏమయ్యాడు? కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు ఇక చాలనుకున్నారా? ఆ సెగ్మెంట్లో రాజకీయాలు ఇక చాలించాలనుకుంటున్నారా? లేక అధికార పార్టీ ఓ అడుగు ముందుకేసి శత్రుశేషం వద్దనుకుని, మంత్రదండం ఏదో వెయ్యాలనుకుంటోందా? సిఎం సెగ్మెంట్ లో అప్లై చేసిన ఓ స్ట్రాటజీనే, అక్కడా అమలు చెయ్యాలనుకుంటున్నారా? అందుకే ఆ నేత గేరు మార్చి, రూటు చేంజ్‌ చెయ్యాలనుకుంటున్నారా ఇంట్రస్టింగ్ ఉంది కదూ లెటస్ వాచ్.

రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ ఇటీవల చేస్తున్న కార్యక్రమాలతో ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా ఉద్యమ గడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖద్దరు పార్టీ కార్యకర్తల్లో కాస్త ఉత్సాహం కనపడుతోంది. పార్టీలో బలం తగ్గినా, నేతల్లో వేడి తగ్గినా, పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులు, ఇప్పటికీ వాడిగానే పని చేస్తున్నారు. దీంతో మళ్ళీ పుంజుకుంటామనే ధీమా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కనపడుతోందట.

ఈయన పేరు కేకే మహేందర్ రెడ్డి. సిఎం కేసిఆర్ తో కలిసి ఉద్యమ సమయాన తిరిగిన నేత. అనివార్యకారణాల వల్ల పార్టీకి గుడ్ బై చెప్పి కేటిఆర్‌పై బరిలోకి దిగుతూ వస్తున్నారు. సిరిసిల్ల నుంచి మొదటిసారి 2009లో పోటీ చేసినా, కేటీఆర్‌కి గట్టి పోటీనే ఇచ్చారు. కేవలం వందల మెజార్డీతో, కేటిఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు కేకే మహేందర్ రెడ్డి. నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటూ ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు ఓడిపోతూనే ఉన్నారు.

అయితే కొంతకాలంగా సిరిసిల్ల సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునే ప్రయత్నం కూడా చేయడం లేదట. రాష్ట్రస్థాయిలో పిలుపునిస్తున్న కార్యక్రమాల్లోనూ సిరిసిల్ల కాంగ్రెస్‌లో పెద్దగా అలికిడి కనిపించడం లేదు. సిరిసిల్ల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ఉందనే వాదనలు కూడా వినపడుతున్నాయి.

కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉన్న సిరిసిల్లలో, పొన్నం ప్రభాకర్ వైపు ఒక వర్గం ఉండగా, అసెంబ్లీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి మరో వర్గంగా ఉన్నారట. ఈ విభేదాలు ఇటీవల జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో స్పష్టంగా కనపడుతున్నాయట. కెకె మహేందర్ రెడ్డిని పొన్నం వర్గం దూరం పెట్టడం వలననే, ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని అనుచర వర్గం ఆరోపిస్తోంది. ఆఖరికి పార్టీ ఇంచార్జ్ గా మీడియా సమావేశాలు కూడా, పార్టీ కార్యాలయంలో కాకుండా జిల్లా కేంద్రంలోని తన నివాసంలో అనుచరులతో నిర్వహిస్తూ, క్యాడర్ తనతో ఉండేలా జాగ్రత్త పడుతున్నారట కేకే.

అయితే ఆ వాదన అలా ఉంటే, టిఆర్ఎస్‌లో గులాబీ దండు మరో రకంగా ప్రచారం చేస్తోంది. గజ్వేల్‌లో సిఎం కేసిఆర్‌పై పోటీ చేసి ఓటమిపాలై, చివరకు అదే కేసిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఒంటేరు ప్రతాప రెడ్డి తరహాలోనే, మంత్రి కేటిఆర్ తనకు భావిరోజుల్లోనూ రాజకీయ శత్రు శేషం లేకుండా కాంగ్రెస్ నేతలకు మంత్రదండం వేస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. అంటే కేకే మహేందర్‌ రెడ్డి కూడా ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి తరహాలోనే కండువా మారుస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

మొత్తానికి కాంగ్రెస్‌లో గ్రూపు రగడ కారణమో, అధికార పార్టీ ఆకర్ష్ మంత్రం ప్రభావమోకానీ, కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల జనాలకు అందుబాటులో లేకపోవడంతో రకరకాల ప్రచారం సాగుతోంది. సో, సిరిసిల్ల కాంగ్రెస్ రాజకీయాలు ఇక చాలనుకుంటున్నారా లేక పార్టీకి తన సేవలు చాలించాలనుకుంటున్నారా మహేందర్‌ రెడ్డి త్వరలో అదిరిపోయే ట్విస్ట్‌ ఇవ్వడం ఖాయమా? లెటస్ వెయిట్ అండ్ సీ. 


Full View


Tags:    

Similar News