వనపర్తిలో దారుణం.. ప్రియుడి మోజులోపడి భర్తను కడతేర్చిన భార్య...
Wanaparthy: కోడిపుంజును బలిస్తామని నమ్మబలికి భర్తనే బలితీసుకున్న భార్య...
Wanaparthy: ప్రియుడి మోజులో పడిన వివాహిత... తన భర్తనే కడతేర్చి... తనకేమీ తెలియనట్లు నటించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన నాలుగు నెలల తర్వాత వెలుగు చూసింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇల్లాలితోపాటు ప్రియుడును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన బాలస్వామికి, లావణ్యతో పదేండ్ల క్రితం వివాహమైంది.
బాలస్వామి వృత్తిరీత్యా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ దంపతులిద్దరూ తమ పిల్లలతో వనపర్తిలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. మదనపూర్‌కు చెందిన నవీన్ వృత్తిరీత్యా డ్రైవర్ . గాంధీనగర్‌లోని తన స్నేహితులతో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో నవీన్‌తో లావణ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. బాలస్వామి ఐదు నెలల క్రితం తనకున్న భూమిని 30 లక్షల రూపాయలకు అమ్మేశాడు.
ఆ డబ్బులుపై కన్నేసిన ఇల్లాలు లావణ్య, ప్రియుడితో కలసి ప్లాన్ వేశారు. ఆ పైసలన్నీ తీసుకొని దూరంగా వెళ్లాలని నిర్ణయించారు. బాలస్వామిని కడతేర్చేందుకు వ్యూహరచన చేశారు. అర్థరాత్రి అమ్మవారికి కోడిపుంజులను బలిస్తే... మంచిజరుగుతుందని భర్తనునమ్మించిన లావణ్య అనుకున్నట్లే పథకం అమలుచేసింది. వనపర్తి జిల్లా కేంద్రం శివారులోని జెర్రిపోతుల మైసమ్మ గుడి వద్దకు అర్ధరాత్రి తీసుకెళ్లింది. జనవరి 21న అర్ధరాత్రి భార్యను ఎక్కించుకెళ్లిన బాలస్వామి దుండగుల చేతిలో బలయ్యాడు.
మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లిన బాలస్వామిని నవీన్, సుపారీ గ్యాంగ్ కురుమూర్తి, బంగారయ్య, గణేశ్‌లు కలిసి కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించి, నోట్లో గుడ్డలు కుక్కి, కొత్తకోట మీదుగా హైదరాబాద్ పరిసరాల్లోని బాలాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చి హతమార్చి అక్కడే శవాన్ని పూడ్చిపెట్టారు. బాలస్వామి అదృశ్యంపై ఆయన కుటుంబీకులు అనుమానం వ్యక్తంచేశారు. బాలస్వామి తమ్ముడు కొమ్మరాజు జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లావణ్య, నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. బాలస్వామిని హత్య చేసేందుకు పాన్‌గల్‌కు చెందిన కురుమూర్తి, బంగారయ్య, గణేష్‌లతో రూ. 2 లక్షల సుపారీ మాట్లాడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని వెలికి తీసేందుకు నిందితులను వనపర్తి పోలీసులు ఇవాళ బాలాపూర్‌కు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు.. నిందితులను కోర్టుకు హాజరు పరచబోతున్నారు.