Manalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
hmtv Manalo Maata: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ విషయంలో అనుసరించిన వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.
hmtv Manalo Maata: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ విషయంలో అనుసరించిన వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. మోడికి స్వాగతం చెప్పాల్సివస్తుందన్న కారణంతోనే ఆయన కర్ణాటక వెళ్లారన్న విమర్శలొస్తున్నాయి. ప్రధాని హైదరాబాద్ రావడానికి ముందుగా, అది కూడా కొద్ది సమయం తేడాతో వెళ్లడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రధానికి సీఎంకు మధ్య దూరం పెరిగిందని భావిస్తున్నారు. కేసీఆర్ ఇలా ప్రధానికి స్వాగతం చెప్పకపోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో కూడా మోడీ పర్యటనకు సీఎం దూరంగా ఉన్నారు. అప్పుడు అనారోగ్యకారణాల వల్ల కేసీఆర్ రాలేకపోయారని అన్నారు. కానీ ఇప్పడు కూడా ప్రధాని టూర్ ను కేసీఆర్ పట్టించుకోకపోవడమే పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదని పలువురు భావిస్తున్నారు.
ప్రధాని టూర్ ఉందని తెలిసిన తర్వాతే ఆయన బెంగుళూరు పర్యటన ఖరారైందని అంటున్నారు. అంతకు ముందు డిల్లీ వెళ్లినప్పుడే కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటారన్న ప్రచారం మొదలైంది. అయితే ఢిల్లీ నుంచి ముందే రావడంతో కేసీఆర్ మనసు మార్చుకోవచ్చని భావించారు. కానీ సరిగ్గా మోడి వచ్చిన రోజే బెంగుళూరు వెళ్లడం ద్వారా తన అసలు వైఖరి ఏంటో చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఎందుకంటే జేడీఎస్ నేత దేవెగౌడ తో సమావేశాన్ని కేసీఆర్ అవసరమనుకుంటే వాయిదా వేసుకునేవారు. కానీ మోడీకి దూరంగా ఉండాలనే ఈ భేటీకి వెళ్లారని భావిస్తున్నారు.
కేంద్రంపై కొంత కాలంగా గట్టిగా పోరాడుతున్న కేసీఆర్ ఈ మధ్య ఎప్పుడూ మోడీని కలవలేదు. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు కూడా ఎప్పుడూ ప్రయత్నించినట్టుగా లేదు. గతంలో ధాన్యం కొనుగోలు సమస్యపై మోడీ అప్పాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదని టీఆరెస్ నేతలు చెబుతుంటారు. అప్పటి నుంచే కేసీఆర్ ప్రధానిని కలవడానికి ఇష్టపడటం లేదని కూడా కొందరు అంటారు. అయితే బీజేపీపై టీఆరెస్ పోరాటాన్ని కొన్ని పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ గా విమర్శించడం వల్ల కూడా కేసీఆర్ మోడీకి దూరంగా ఉంటున్నారనే వారూ ఉన్నారు. తాను బీజేపీపై సీరియస్ గానే ఫైట్ చేస్తున్నానని విపక్షాలకు చెప్పడమే దీని ఉద్దేశమని కూడా అంటారు. అయితే బీజేపీ పై పోరాడటం వేరు ప్రధాని కి స్వాగతం చెప్పడం వేరు అనేవారూ ఉన్నారు.
ప్రధానికి సీఎం స్వాగతం చెప్పడం సంప్రదాయమని దీనిని పట్టించుకోకపోవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. టీఆరెస్ మాత్రం సీఎం కచ్చితంగా ఆహ్వానించాల్సిన అవసరమేమీ లేదని సమర్ధించుకుంటోంది. కానీ ఇప్పటికే కేసీఆర్ గవర్నర్ తమిళి సై ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో గవర్నర్ స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తగ్గట్టుగా కేసీఆర్ చాలా కాలంగా రాజ్ భవన్ కు దూరంగా ఉన్నారు. వివిధ కార్యక్రమాలకు కూడా వెళ్లలేదు. గవర్నర్ ఎదురుపడతారన్న కారణంతోనూ కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు కారణాలు ఏవైనా కేసీఆర్ బీజేపీపై పోరాటానికి అవకాశమున్న ప్రతీ సందర్భాన్నీ ఉపయోగించుకుంటున్నారని భావిస్తున్నారు.