కాంగ్రెస్ అనుకున్న మైలేజీ రాకపోవడంతో రఘునందన్‌రావును టార్గెట్ చేసిందా?
*కమలం దూకుడును కాంగ్రెస్ డైజెస్ట్ చేసుకోలేకపోయిందా?
Raghunandan Rao Vs Congress: తెలంగాణ కాంగ్రెస్ ఆ బీజేపీ ఎమ్మెల్యేను ఎందుకు టార్గెట్ చేసింది? బీజేపీ మైనర్ బాలికకు న్యాయం కోసం పోరాడుతుంటే, హస్తం పార్టీ కమలదళంలోని ఆ ఎమ్మెల్యేపై పోరాటం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? జాతీయ స్థాయిలో కాషాయం క్యాంప్‌నకు వస్తున్న మైలేజీని మైనస్ చేసే ఎత్తుగడేనా ఇదంతా? జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేయడానికే ఈ కొత్త ఎత్తుగడను కాంగ్రెస్ తెర మీదకు తెచ్చిందా? తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ఈ కొత్త చర్చపై జరుగుతున్న రచ్చేంటి?
తెలంగాణలో ఇటీవల సంచనం సృష్టించింన జూబ్లీహిల్స్ పబ్ కేసు వ్యవహారం రాజకీయంగా రచ్చ రచ్చ చేసింది. ఏకంగా మూడు పార్టీల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలను కార్నర్ చేయడానికి ఈ కేసులో కమలం క్యాంప్ చాలా దూకుడుగా వ్యవహరించింది. ఈ కేసులో కారు, మజ్లిస్ ఎమ్మెల్యేల కుమారులు ఉండడంతో దోషులను దాచిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఏకంగా గ్యాంగ్ రేప్‌లో బాధ్యులుగా ఉన్నారని తెలిసేలా ఓ ఎమ్మెల్యే కుమారుడి ఫోటోలు, వీడియోలను కూడా రిలీజ్ చేశారు.
ఈ కేసు మొదటి నుంచి కూడా అంత యాక్టివ్‌గా లేని కాంగ్రెస్ అప్పటి దాకా మౌనంగా ఉండీ అనూహ్యంగా రంగంలో దిగింది. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ విషయం పక్కన పెట్టి నిందితుల ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసిన బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును మెయిన్‌గా టార్గెట్ చేసింది. మైనర్ బాలిక ఫోటో రిలీజ్ చేయడాన్ని తప్పుపడుతూ బీజేపీని కార్నర్ చేసేందుకు అన్ని ఎత్తుగడలను అమలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, ఒక లాయర్ అయిన బీజేపీ ఎమ్మెల్యే ఎలా రిలీజ్ చేస్తారంటూ రఘునందన్ తీరును తప్పుపట్టింది. ఆధారాలు ఉంటే పోలీసులకు, న్యాయస్థానానికి ఇవ్వాలే కానీ, బహిరంగంగా విడుదల చేయడం ఏంటని రఘునందన్ వైపు వేలెత్తి చూపించింది. ఒక మైనర్ బాలికను ప్రజల్లో చూపించి ఆమెను అవమానించేలా బీజేపీ వ్యవహరించిందన్న కొత్త కోణాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్ మహిళల సానుభూతి కోసం పాకులాడిందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
వాస్తవానికి, జూబ్లీహిల్స్ పబ్ కేసులో మొదటి నుంచి బీజేపీ దూకుడుగానే వ్యవహరించింది. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కమలం నేతలు ఆధారాలు చూపించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో రాజకీయంగా కాంగ్రెస్ తేరుకునే లోపే బీజేపీ అందనంత దూరానికి వెళ్లిందన్న టాక్ ఉంది. అందుకే, జూబ్లీహిల్స్ కేసులో తాము వెనుకబడిపోతున్నామన్న భావనతో ఉన్న హస్తం పార్టీ రఘునందన్ దూకుడును కార్నర్ చేస్తూ, అదే సమయంలో బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రజల్లో సానుభూతిని పొందాలనే ప్రయత్నం ప్రారంభించింది. దీనికితోడు, ఈ అంశం జాతీయస్థాయిలో చర్చకు రావడంతో రఘునందన్ చేసింది తప్పు అని చాటి చెప్పడానికి బీజేపీ కార్యాలయాన్ని, ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించింది. అయినా తాము అనుకున్న మైలేజీ రాలేదనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కమలం క్యాంప్‌ను కార్నర్ చేసే ప్రయత్నంలో తానే డిఫెన్స్‌లో పడిందన్న చర్చ జరుగుతోంది.
అయితే, ఎమ్మెల్యే రఘునందన్‌రావు విడుదల చేసిన వీడియోలు, ఫోటోలను కాంగ్రెస్ తప్పుపట్టినా బాధిత మైనర్ బాలికకు న్యాయం కోసం పోరాడలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. బాలిక ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడం వల్ల ఇష్యూను బీజేపీ మెడకు చుట్టుకునేలా యత్నించినా కాంగ్రెస్ అందులో సక్సెస్ కాలేకపోయిందన్న చర్చ జరుగుతోంది. రాజకీయ లబ్ది కోసం కాకుండా బాధిత బాలిక కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తే బాగుండేదన్న సూచనలు వచ్చాయి. మరి, అమెరికా ఫ్లైట్ దిగి, ఇండియాలో ల్యాండ్ అయిన పీసీసీ చీఫ్ ఈ ఇష్యూను ఎలా దారిలో పెడతారో చూడాలి.