తెలంగాణ విద్యాశాఖ ఆన్ లైన్ క్లాసులను చాలెంజింగ్ గా తీసుకుంది. విద్యాసంవత్సరం వృధా కాకూడదని టెలివిజన్ క్లాసులను ప్రవేశపెట్టింది. కానీ అది పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోతోంది. పదో తరగతి విద్యార్థులు పర్వాలేదంటున్న 8వ తరగతిలోపు విద్యార్థులు మాత్రం అర్థమవ్వలేదని తల అడ్డంగా ఊపుతున్నారు. అసలు విద్యార్థులకు వచ్చిన చిక్కులెంటి.? టీచర్లు ఏం అంటున్నారు..?
కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంవత్సరం వృధా కాకూడదని విద్యాశాఖ ఆన్ లైన్ క్లాసులను తెరపైకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టెలివిజన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఏమైనా డౌట్స్ ఉంటే ఉపాధ్యాయులు వివరించాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులతో వర్క్‌షీట్లు కూడా చేయించాలని స్పష్టం చేసింది.
ఆన్ లైన్ క్వాసుల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కసరత్తులు చేసింది. కానీ ఆశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు. 9, 10వ తరగతుల విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడ్డారు. కానీ 3 నుంచి 8 తరగతుల విద్యార్థులు మాత్రం టీవీ పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే సాధారణ సమయాల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైన 40-50 రోజుల్లో ఎఫ్ఏ-1 పరీక్షలు నిర్వహిస్తారు. అవి జూలై లోపు పూర్తయ్యేవి. ఈసారి ఆన్‌లైన్ తరగతుల ద్వారానే బోధన జరుగుతుండటంతో పరీక్షల విషయంపై ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.