Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వానలే.. వానలు!

Weather Updates: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో రెండు, మూడు రోజుల పాటు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2020-08-14 01:30 GMT
Heavy Rains in Telugu States

Weather Updates: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో రెండు, మూడు రోజుల పాటు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లో దాదాపుగా 24గంటలు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఈ రోజు, రేపు ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో దాదాపు మూడోసారి అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో గురువారం నాటికి సాధారణ వర్షపాతం 47.3 సెంటీమీటర్లు కాగా, ఇప్పటికే 56.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం ఏర్పడి న అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజుల పాటు వానలు కురుస్తాయని తెలిపారు.

బూర్గంపహాడ్‌లో 15.4 సెం.మీ. వర్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ మండలంలో గురువారం 15.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురంలో 13.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు మండలాల్లో 13 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అన్నపురెడ్డిపల్లి, ముల్కపల్లి, టేకురెడ్డిపల్లి, గార్ల మండలాల్లో 10, భద్రాద్రి కొత్తగుడెం, మహబుబాబాద్‌ జిల్లాల్లో 8.7 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

నేడు, రేపు వానలే వానలు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌–పట్టణ, గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్‌ నిండా మునిగింది. 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఏపీలో భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్ప అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మండల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు, రెవెన్యూ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, తదితర సంబంధిత అధికారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగంతో సహకరించి వారు జారీ చేసిన సూచనలు పాటించాలని కోరారు.

బందరు కలెక్టరేట్ : 08672-252572

విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805

సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ : 0866-2574454  

Tags:    

Similar News