Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు..వాతావరణ సమాచారం కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల పరిధిలో దట్టమైన మేఘాలు వ్యాపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు గుర్తించారు. అంతే కాకుండా పవనంలోనూ చురుగ్గా కదలికలు కలగడంతో తెలంగాణ, కోస్తాంధ్రలో మంగళవారం నుంచి రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాయలసీమలో కూడా అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు.
మరోవైపు కేంద్ర వాతావరణ విభాగం వాతావరణ సమాచారం కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. 'మౌసమ్' పేరుతో విడుదలైన ఈ మొబైల్ అప్లికేషన్ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. 'మౌసమ్' యాప్‌ను ఇక్రిసాట్, ఐఐటీఎం, పుణె, భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సంయుక్తంగా రూపొందించి అభివృద్ధి చేశాయి. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉంటుందో వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, ఆర్ధ్రత, గాలి వేగం వంటి సమగ్ర సమాచారాన్ని అందించనుంది. దీని ద్వారా చిటికెలో పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేట్టుగా రూపొందించారు. స్థానిక వాతావరణం వివరాలతో పాటు విపత్తుల సమయంలో ప్రత్యేక హెచ్చరికలను కూడా ఈ యాప్ ఎప్పటికప్పుడు జారీచేస్తుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ దీన్ని ఆవిష్కరించారు. దీని ద్వారా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతే కాకుండా రాబోయే వారం రోజుల వాతావరణ పరిస్థితులను కూడా ఈ యాప్ తెలియజేస్తుంది. ప్రమాద హెచ్చరికలకు సంబంధించి భిన్న రంగుల్లో(ఎరుపు, పసుపు, నారింజ) కోడ్‌ను రూపొందించారు.
ఇక పోతే ప్రస్తుతం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు రెండు రోజుల పాటు వీస్తాయని అధికారులు తేల్చారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సముద్రం కల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.