Weather: తెలంగాణాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం!

మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణా మీద కూడా పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2021-02-17 01:42 GMT

తెలంగాణా కు వర్ష సూచన (ఫోటో: హాన్స్ ఇండియా)

మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణా మీద కూడా పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. దానికారణంగా బుధవారం, గురువారం తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా అదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వివరించింది.

ఇదిలా ఉండగా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉంది. మంగళవారం మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ లో 13.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజా‌త‌న‌గ‌ర్‌లో 37.4డిగ్రీల అత్యధిక ఉష్ణో‌గ్రత నమో‌దై‌నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

Tags:    

Similar News