ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి
తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండాకాలం ప్రారంభానికి ముందే నీటి ఎద్దడి మొదలైంది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండాకాలం ప్రారంభానికి ముందే నీటి ఎద్దడి మొదలైంది. ఉట్నూరు మండలం తుకారం గూడలో తాగడానికి, అవసరాలకు నీరు లేక ఆదివాసులు అల్లాడిపోతున్నారు. చెప్పాలంటే ఎన్నో ఏళ్ల నుంచి గ్రామస్తుల దాహార్తిని తీర్చుతున్న మూడు చేతిపంపులలో నీరు అడుగంటి పోయి పనిచేయడం లేదు. మోటార్లు కాలిపోవడంతో నీటి ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. దీంతో జనాలు వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.
నీటికోసం కిలోమీటర్ల మేర నడక..
ఉదయం లేవగానే నీటికోసం గ్రామశివారులోని వ్యవసాయ బావివైపు గిరిజనులు పరుగులు పెడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. నీటికోసం కూలిపనికి పోకపోగా.. బావి దగ్గరకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఫిబ్రవరి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే మూడు నెలలు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికీ పూర్తికాని మిషన్ భగీరథ పనులు
ఇక గతేడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో పంటల సాగు విస్తారంగా జరుగుతోంది. రబీ సీజన్‌లోనూ వరి పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుండటంతో బోర్ల ద్వారా నీటి వాడకం ఎక్కువ అవుతోంది. దీంతో రోజురోజుకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. మరోవైపు మిషన్ భగీరథ పనులు పూర్తిస్థాయిలో కంప్లీట్ కాకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ పరిస్థితి అర్థం చేసుకుని నీటి సమస్యను పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.