గ్రేటర్ వరంగల్‌లో వాటర్ ప్రాబ్లమ్స్.. మేలో సమస్య మరింత పెరిగే అవకాశం...
Greater Warangal: ఇప్పటికే 2,3 రోజులకోసారి నీటి సరఫరా...
Greater Warangal: గ్రేటర్ వరంగల్(Greater Warangal)లో వాటర్ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. తాగునీటిని ట్యాంకర్లతో సరఫరా చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటంతో నీటి ఎద్దడి మొదలైంది. వచ్చె నెల మేలో సమస్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి వరంగల్ నగరంలో కొన్ని డివిజన్లకు తాగునీటి సరఫరా రెండు, మూడు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు బల్దియా అధికారులు. దీంతో తిప్పలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.
తాజాగా పైపులైన్ల మరమ్మతులతో రెండు, మూడు రోజులకోసారి మంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. కరీంనగర్(Karimangar) ఎల్‌ఎండీ ధర్మసాగర్ ప్రధాన పైపులైన్ అనుసంధానం పనులు ఆలస్యమవడం మరింత సమస్యగా మారింది. మొదట దశ పనుల కోసం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బల్దియా అధికారులు పనులు పూర్తికాకపోవడంతో మరోసారి నీటి సరఫరాను నిలిపివేశారు.
అయితే ఇప్పటికైనా పనులు పూర్తవుతాయా లేదా అన్నది అర్థం కాక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా... ప్రధాన కాలనీల్లోని ఇంటి యజమానులు బోర్లు బిగించుకున్నారు. ఇక బస్తీలు, స్లమ్ ఏరియాల్లో బల్దియా అందించే నీరే గతి. ఇక వేసవిలో నీటి ఎద్దడి తలెత్తితే పరిస్థితి దారుణంగా ఉంటుందని స్థానికులు మండిపడుతున్నారు.