సంగారెడ్డి జిల్లాలో జలకాలుష్యం.. వ్యర్థాలను నీటిలో వదులుతోన్న పరిశ్రమల యజమాన్యాలు
Water Pollution in Sangareddy : సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా నీటిలోకి వదిలేస్తున్నారు నిర్వాహకులు. గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తుండటంతో ఆ వరద నీటిలోనే ప్రమాదకరమైన రసాయనాలను వదులుతున్నారు. దీంతో ఇప్పటికే కాలుష్య కాసారాలుగా మారిన పారిశ్రామిక ప్రాంతాల్లోని చెరువుల్లో వ్యర్థాలు భారీగా చేరుతున్నాయి. అటు అధికారులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో స్థానికులు మండిపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతంమైన జిన్నారంలో కొన్ని రసాయన పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థాలను వర్షపు నీటిలోకి వదులుతున్నాయి. దీంతో చెరువుల్లోకి భారీగా వ్యర్థాలు చేరుతున్నాయి. ఇక కాజీపల్లి పరిధిలోని పరిశ్రమలు వదులుతున్న వ్యర్థాలు జిల్లెలవాగు నుంచి భారీగా ప్రవహిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున్న పూర్తిగా జల కాలుష్యం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న చెరువులు మొత్తం రసాయనాలతో నిండి ఘాటైన వాసనలు వస్తున్నాయి.
ఇక పరిశ్రమల నుండి చెరువులకు వచ్చిన వ్యర్థాలు కనిపించకుండా మట్టితో కప్పేస్తున్నారు. మరికొన్ని పరిశ్రమలు బయటి ఔట్లెట్ల ద్వారా విడుదల చేసిన వ్యర్థాలను సిబ్బంది ద్వారా బకెట్లతో ఎత్తి పోస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జిన్నారం మండలంలో 450 వరకు పరిశ్రమలు ఉండగా వీటిలో 80 శాతం రసాయన పరిశ్రమలే ఉన్నాయి. దాదాపు ఈ ఫ్యాక్టరీలన్నీ వర్షాకాలం వచ్చిందంటే వ్యర్థాలను చెరువులోకి వదిలివేయటం కొన్నేళ్లుగా సాగుతోంది. దీంతో జిన్నారం మండలంలోని 15 చెరువులు, 25 కుంటలు కలుషితమయ్యాయి. వీటిని కట్టడి చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శాంపిళ్ల సేకరణకే పరిమితం కావటం విమర్శలకు తావిస్తుంది.
రసాయన పరిశ్రమల నుండి వ్యర్థాలను నీటిలోకి వదిలిపెట్టడంతో అందులో నీరు తాగిన పశువులు, పక్షలు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం వదిలిపెట్టిన చేపపిల్లలు కూడా మరణించాయి. ఇక భూగర్భజలాలు సైతం పూర్తిగా కలుషితం అవుతున్నాయి. ఈ నీరు తాగి ఎంతోమంది అనారోగ్యం భారిన పడుతున్నారు. దీంతో ఇకనైనా అధికారులు స్పందించి ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.