Telangana Ward Officer Jobs : వార్డు ఆఫీస‌ర్ నియామ‌కాలు త్వరలోనే చేప‌డ‌తాం : మంత్రి కేటీఆర్‌

Update: 2020-09-16 07:32 GMT

Telangana Ward Officer Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా వార్డు ఆఫీస్‌ కార్యాలయాలు తీసుకురానున్నారు. ఈ అంశంపై తాజాగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఓ స్పష్టతను ఇచ్చారు. హైద‌రాబాద్ అభివృద్ధికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు శాస‌న‌మండ‌లిలో మంత్రి స‌మాధాన‌మిచ్చారు.

వీలైనంత త్వ‌రలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస‌ర్ నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని ఆయన ప్ర‌క‌టించారు. వార్డు ఆఫీస్ కార్యాల‌యాలు కూడా నిర్మిస్తామ‌ని తెలిపారు. ఇదే కనుక జరిగితే అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకడంతో పాటు ప్రజాసేవలు సైతం మెరుగ్గా ప్రజలకు చేరుతాయని ఆయన వెల్లడించారు. ఉద్యోగ నియామకాలు జరిగిన అనంతరం అభ్యర్థులకు మొద‌టి మూడేండ్లు ప్రొబేష‌న‌రీ కాల‌ప‌రిమితి ఉంటుందని చెప్పారు. కార్పొరేట‌ర్‌, వా‌ర్డు ఆఫీస‌ర్ క‌లిసి ప‌నిచేస్తార‌ని వెల్ల‌డించారు. ఈ విధానాన్ని అమలులోకి తీసుకవచ్చిన ఏపీ ప్రభుత్వం అనుకున్నట్టుగానే బాగానే విజయం సాధించిందన్నారు.

ఇప్పటికే హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి అన్ని రకాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బ‌కాయిలు ఇవ్వ‌కున్నా రాష్ట్రప్ర‌భుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌కు క్ర‌మంత‌ప్ప‌కుండా నిధుల‌ను ఇస్తున్న‌ద‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఆస్తిప‌న్ను, నీటి ప‌న్ను పెంచ‌లేద‌ని, పైగా ప‌న్నులు త‌గ్గించామ‌ని ఆయన చెప్పారు.

Tags:    

Similar News