అవే మాటలు.. అవే మంటలు.. ముందస్తుకు సన్నాహమే అంటున్న..
Telangana: తెలంగాణలో కొట్లాట రాజకీయం నడుస్తోంది. అవును మీరు విన్నది నిజమే.!
Telangana: తెలంగాణలో కొట్లాట రాజకీయం నడుస్తోంది. అవును మీరు విన్నది నిజమే.! విమర్శలకు మాత్రమే పరిమితం కావాల్సిన అధికార, విపక్షాలు ఈ మాత్రం సరిపోదు, ఇంకాస్త డోస్ పెంచాలంటున్నాయి. నేరుగా నేతలే కార్యకర్తలను కొట్లాడమని ఇస్తున్న పిలుపులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్ష యుద్ధానికి కారణం అవుతున్నాయి. ఆర్మూర్‌లో మొదలైన బీజేపీ, టీఆర్ఎస్ వార్ ధర్పల్లి సాక్షిగా పతాకస్థాయికి చేసింది. ఇంతకూ కమలం, కారు ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.
తెలంగాణలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య హైవోల్టేజ్ డైలాగ్ వార్ అంతేలేదన్నట్టుగా సాగుతోంది. ఆర్మూర్ టు ధర్పల్లి అడ్డగింతల డ్రామా యాక్షన్ సీక్వెల్‌ను తలపిస్తోంది. కేసీఆర్‌పై కామెంట్ చేస్తే అడ్డుకోవడం కాదు.. కొట్టడమే కరెక్ట్ అన్న బాజిరెడ్డి వ్యాఖ్యలు అగ్గిలో ఆజ్యం పోస్తే.. తిరగబడ్డం కాదు, తిరిగి కొట్టాల్సిందే అన్న అరవింద్ కామెంట్స్ అగ్నిపర్వతాన్నే రగిల్చాయి. ఇద్దరి నేతల కొట్లాట కామెంట్స్‌తో టీ పాలిటిక్స్‌లో పొలిటికల్ యుద్ధం పతాకస్థాయికి చేరింది.
సీఎంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే అడ్డుకోవడం కాదు.. కొట్టడమే కరెక్ట్ అన్నారు. నిజామాబాద్ ఎంపీ అయినా, ఇంకొకరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేదే లేదన్నారు. అంతేనా, బీజేపీ నేతలు అడ్డుకుంటే ఎదురు తిరగండి ఎక్కడిక్కడ అడ్డుకోండి అంటూ సొంత పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సరిగ్గా అధికార పార్టీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలే టీ పాలిటిక్స్‌లో తుఫాన్ అయ్యాయి. అప్పుడు మొదలు ఇరు పార్టీల మధ్య హైటెన్షన్ వార్ అంతకుమించి అన్నట్టుగా సాగుతోంది.
ఇటు.. కేటీఆర్ సైతం టీబీజేపీపై ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ టీఆర్ఎస్ నాయకులే ఉన్నారనీ, అలాంటప్పుడు విపక్ష పార్టీ నేతలు ఏదో మాట్లాడితే పడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. జనగాంలో, ఆర్మూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉరికించినట్టే ఇకముందూ ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో బీజేపీ సైతం ఎక్కడా తగ్గట్లేదు. ధర్పల్లి సాక్షిగా బాజిరెడ్డిపై బీజేపీ ఎంపీ కౌంటర్ కామెంట్స్ చేశారు. ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే ప్రతి దాడి చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో ఛత్రపతి విగ్రహావిష్కరణ కాస్తా రచ్చ రచ్చగా మారిపోయింది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడం, పరస్పర ఆందోళనలకు దిగడంతో అక్కడ కనిపించిన యుద్ధవాతావరణం అధికారులనే టెన్షన్ పెట్టింది.
ఎంపీ అరవింద్ అక్కడితో ఆగలేదు. తనపై దాడి చేసిన జీవన్‌రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారని, ఇప్పుడు దాడి చేయమని చెప్పిన బాజిరెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే సంతోషమే అంటూ ఎద్దేవా చేశారు. అంతేనా, జై తెలంగాణ ముసుగులో 6 అంశాల్లో అతిపెద్ద కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణే చేశారు. ఇదే సమయంలో హిందూ, ముస్లిం వివక్షత అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ముస్లింల ర్యాలీలకు అనుమతిస్తూ హిందూ ర్యాలీలపై వివక్షత చూపుతున్నారని ఆరోపిస్తూనే దమ్ముంటే ఈ క్షణమే ఎన్నికలు పెట్టండి గెలుపెవరిదో తేలిపోతుందని సవాల్ విసిరారు.
ఈ రచ్చ ఇలా కొనసాగుతుండగానే బీజేపీ నేతలు నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. సీఎం మేడారం టూర్ లాస్ట్ మినిట్‌లో రద్దు కావడంపై బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతోనే సీఎం మేడారం జాతరకు రాలేదని ఆరోపించారు. గిరిజనులు, హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలన్నారు బండి సంజయ్.
మేడారం జాతరపై బీజేపీ నేతలు కేసీఆర్‌ను టార్గెట్ చేస్తే అధికార పార్టీ మంత్రులు ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. ఆదివాసీల జాతర అంటే మోడీకి ఎందుకంత నిర్లక్ష్యం అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమాలకు మోడీతో సహా మంత్రుల వస్తారు కానీ జాతరకు ఎందుకు రారని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒంట్లో బాలేకనే జాతరకు రాలేకపోయారని తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
మొత్తంగా తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వార్ అంతకుమించి అన్నట్టుగానే సాగుతోంది. ఇరు పార్టీల నేతలూ ఏ ఒక్క అంశాన్నీ విడిచిపెట్టకుండా మాటల మంటలకు ఆజ్యం పోస్తున్నారు. ఇరు పార్టీల నేతల దూకుడు చూస్తుంటే ముందస్తుకు సన్నాహమే అంటున్నారు విశ్లేషకులు.