72 ఏండ్లుగా నవరాత్రుల్లో ఒకే విగ్రహాన్ని నిలుపుతన్న గ్రామస్థులు

Wood Ganesh : వినాయక నవరాత్రులు మొదలయ్యాయంటే చాలు దేశవ్యాప్తంగా సంబరాలు మొదలవుతాయి.

Update: 2020-08-23 09:19 GMT

చెక్క గణపతి విగ్రహం

Wood Ganesh : వినాయక నవరాత్రులు మొదలయ్యాయంటే చాలు దేశవ్యాప్తంగా సంబరాలు మొదలవుతాయి. రకరకాల రూపాలలో విగ్రహాలను మట్టితో,ప్లాస్టరాఫ్ పారిస్ తో తయారు చేసి నవరాత్రులు లేదా 11 రోజుల పాటు పూజలు చేసి ఆ తరువాత ఆ గణనాధున్ని నిమజ్జనం చేస్తారు. కానీ ఒక గ్రామంలో మాత్రం గ్రామస్థులు వినయాకున్ని నిలిపి నవరాత్రులు పూజిస్తారు. కానీ ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా విగ్రహంపై నీళ్లు చల్లి నిమజ్జన ప్రక్రియ ముగిస్తారు. గత 72 సంవత్సరాల నుంచి ఇదే విధంగా పూజలందుకుంటున్నాడు ఆ గణనాథుడు.

మరి ఈ గణనాథుడు ఎక్కడున్నాడు తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలోని గ్రామస్థులు వినాయక చవితి సందర్భంగా ఓ కర్ర వినాయకుడిని విగ్రహాన్ని అన్ని గ్రామాల్లో లాగే ప్రతిష్టిస్తారు. ఆ తరువాత 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి 11వ రోజు వినాయక విగ్రహాన్ని ప్రత్యేక రథంలో ఊరేగిస్తారు. అలా ఊరేగిస్తూ గ్రామ సమీపంలోని వాగుకు తీసుకెళతారు. అక్కడ ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా విగ్రహంపై నీళ్లు చల్లి నిమజ్జన ప్రక్రియ ముగిస్తారు. మళ్లీ ఆ విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చి గణపతి ఆలయంలో భద్రపరుస్తారు. అయితే ఈ విగ్రహాన్ని ఎప్పుడు పడితే అప్పుడు బయటికి తీయకుండా కేవలం వినాయక నవరాత్రుల సందర్భంగా మాత్రమే బయటకు తీస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయంలో ఉండే సత్య గణేశుడి చిత్రపటానికి పూజలు చేస్తారు.

ఇక్కడికి వచ్చిన భక్తుల కోర్కెకలు తీర్చే దైవంగా పేరుండటంతో ఇక్కడికి తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఈ విగ్రహాన్ని కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచిన నిర్మల్ పట్టణంలో 1948వ సంవత్సరంలో తయారు చేయించారు. అప్పటి నుంచి అంటే గత 72 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే ఈ గణపతి ఉత్సవాలను ఈ సారి మాత్రం నిరాడంబరంగానే చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో నవరాత్రుల్లో కేవలం గ్రామస్థులు మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు.




Tags:    

Similar News